అడ్డా మార్చారు...
పరిగి, న్యూస్‌లైన్: నగర శివారులో రిసార్టులపై పోలీసులు దాడుల నేపథ్యంలో ‘జల్సారాయుళ్లు’ తమ రూటు మార్చారు. గ్రామీణ ప్రాంతాలైతే సురక్షితంగా ఉంటుందని భావించి ఇక్కడి ఫాంహౌస్‌లలో తమ ‘కార్యకలాపాలు’ నిర్వహిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి దాటాక పోలీసులు పరిగి మండల పరిధిలోని తొండపల్లి సమీపంలోని ఫాంహౌస్‌లో దాడి చేశారు. అశ్లీల నృత్యాలు, వ్యభిచారం నిర్వహిస్తున్న 20 మంది పురుషులతో పాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. పచ్చని పల్లెల్లో ఇలాంటి ‘పాడుపని’ ఏమిటని స్థానికులు నిర్ఘాంతపోయారు. నింది తులు మద్యం మత్తులో నృత్యాలు చేస్తూ పేకాట ఆడుతున్నారు. నగర శివారు ప్రాంతాల్లో పోలీసులు రిసార్టులపై దాడులు చేస్తుండడంతో జల్సారాయులు రూటు మార్చినట్లుగా తెలుస్తోంది. పరిగి మండలం మారుమూల ప్రాంతమవడంతో వారు ఎంచుకున్నారు.
సురక్షిత ప్రాంతమనే..
రియల్ బూమ్ సమయంలో నగరవాసులు చాలామంది పరిగి, పూడూరు మండలాల్లో భూములు కొనుగోలు చేసి తోటలు పెంచుతూ విలాసవంతమైన భవనాలు నిర్మించుకొని ఫాంహౌస్‌లను ఏర్పాటు చేసుకున్నారు. భారీ ఎత్తుగా ప్రహరీలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో లోపల ఏం జరుగుతుందనే విషయం స్థానికులకు తెలిసే ఆస్కారం లేకుండా పోయింది. దీంతో కొందరు జల్సారాయుళ్లు అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు.
పరిగి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో కలిపి దాదాపు 200-250 ఫాంహౌస్‌లు ఉన్నాయి. కాగా బిజీ జీవనంతో సతమతమమ్యే నగరవాసులు కొందరు ఫాంహౌస్‌లకు వస్తూ సేదతీరుతున్నారు. ఇటీవల ఫాంహౌస్‌లకు జంటల తాకిడి కూడా బాగా పెరిగిందని, వారిని స్ధానికులు ప్రశ్నిస్తే వాహనాలపై పరారవుతున్నారని చెబుతున్నారు. దీనిని బట్టి అసాంఘిక కార్యకలాపాలు ఏమేర సాగుతున్నాయో.. ఊహించుకోవచ్చు. ఫాంహౌస్‌ల నిర్వాహకులు కొందరు డబ్బుకు ఆశపడి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఆందోళనలో స్ధానికులు..
పచ్చని పల్లెలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతుండడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పల్లె వాతావరణం కలుషితమవుతోందని చెబుతున్నారు.