కొత్తగా జంగారెడ్డిగూడెం పోస్టల్ సబ్‌డివిజన్
కుక్కునూరు (పోలవరం): సబ్ పోస్టాఫీస్‌ను అభివృద్ధి చేసేందుకు విలీన మండలాల ప్రజలు సహకారం అందించాలని ఏలూరు పోస్టల్ సూపరింటెండెంట్ ఎస్ఎంఎస్ఎస్వీ ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం కుక్కునూరులో సబ్‌పోస్టాఫీస్ సేవలను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు బూర్గంపాడు సబ్పోస్టాఫీస్తో అటాచ్ అయి ఖమ్మం సర్కిల్ పరిధిలో పనిచేసిన మండలానికి చెందిన బీపీవోలు ఇకపై ఏలూరు సర్కిల్ కింద పని ప్రారంభించారన్నారు. ఇకపై కుక్కునూరు పిన్‌కోడ్ 534444 అమలులోకి వస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను జీలుగుమిల్లి సబ్ ఆఫీస్‌కు అటాచ్ చేయాలని ఆదేశాలు కూడా వచ్చాయన్నారు. కుక్కునూరులో సబ్ పోస్టాఫీస్ ఏర్పాటుతో 103 సబ్ ఆఫీసులతో జంగారెడ్డిగూడెం సబ్‌డివిజన్‌గా ఏర్పడిందని తెలిపారు. కుక్కునూరు సబ్‌పోస్టాఫీస్ ద్వారా మండల ప్రజలకు ఐఎంటీఎస్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయని, రూ.100 సేవింగ్ ఖాతాలు కూడా పొందవచ్చన్నారు. కుక్కునూరు సర్పంచ్ మడకం సుజాత, ఉప సర్పంచ్ నారాయణరాజు, డీసీసీబీ డైరెక్టర్ కోటగిరి సత్యనారాయణ, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ శ్రీనివాస్, ఎన్‌ఎఫ్‌పీఈ, ఎఫ్‌ఎన్‌పీవో యూనియన్ నాయకులు, బీపీఎంలు పాల్గొన్నారు.