Jaundice disease
-
డైరెక్టర్ని పొట్టన పెట్టుకున్న జాండిస్? ఎందుకు వస్తుంది? లక్షణాలు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ అకాలమరణం విషాదాన్ని నింపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన పచ్చకామెర్లు వ్యాధితో చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది. లక్షణాలు ఏంటి? ఇది ప్రాణాంతకమేనా తదితర వివరాలను తెలుసుకుందాం. పచ్చకామెర్లు సరైన సమయంలో చికిత్స తీసుకోనట్టయితే ఇది కూడా ప్రాణాంతక వ్యాధి. తొలి దశలోనే గుర్తించక పోతే నష్టం తీవ్రంగా ఉంటుంది. మన శరీరంలోని లివర్ లేదా కాలేయం చాలా పనులను నిర్వరిస్తుంది. వైరస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఆల్కహాల్ లేదా మాదకద్రవ్యాల వినియోగం, తదితర కారణాల చేత కాలేయం సరిగ్గా పని చేయనప్పుడు జాండిస్ వ్యాధి వస్తుంది. ఎసిటమైనోఫెన్, పెన్సిలిన్, గర్భనిరోధక మాత్రలు , స్టెరాయిడ్స్ వంటి మందులు కూడా కాలేయ వ్యాధికి కారణం కావచ్చు. ఈ కామెర్లు నవజాత శిశువులు మొదలు ఎవరికైనా రావచ్చు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. కామెర్లలో నాలుగు రకాలు ఉన్నాయి. ప్రధానంగా రక్తంలోని బిలిరుబిన్ను ఉత్పత్తి పెరిగిపోతోంది. ఫలితంగా కళ్లు, గోళ్లు పసుపు రంగులోకి మారుతాయి. లక్షణాలు ♦ బరువు తగ్గడం, ఆకలి తగ్గుతుంది. మత్తుగా ఉండటం, ♦ శరీరం పసుపు పచ్చ కలర్లోకి మారిపోతుంది. కళ్ళు , మూత్రం కూడా పసుపు రంగులోకి మారతాయి. ♦ కడుపులో మంట ,కడుపు నొప్పి ♦ ముఖ్యంగా పక్కటెముకల దిగువ భాగంలో బాగా నొప్పి , వికారం వాంతి వచ్చినట్టు ఉంటుంది. ♦ చలి, జ్వరం ♦ రక్తపు వాంతులు మద్యపానం, ఇతర కారణలు కొన్ని ఇతర కారణాలతోపాటు అతిగా మద్యం సేవించే వారిలో కాలేయం దెబ్బతినే అవకాశాలు చాలా ఉన్నాయి. పుట్టుకతో వచ్చే కొన్ని లోపాలు కూడా కామెర్లు వచ్చేందుకు దారి తీస్తాయి. కాలేయం నుంచి పేగుల్లోకి పైత్య రసాన్ని తీసుకుని వెళ్లే కాలేయ వాహికలో రాళ్లు, నిర్మాణపరమైన లోపాలు, కేన్సర్ సోకినా కామెర్లకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు కామెర్ల వ్యాధిని నిర్లక్ష్యంచేస్తే రక్తపు వాంతులతోపాటు, రోగి కోమాలోకి వెళ్లి చనిపోయేప్రమాదం కూడా ఉంది. అందుకే అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం నోట్: సమతుల ఆహారాన్ని తీసుకుంటూ, మద్యపానం, ధూమపానం, గుట్కా లాంటి చెడు అటవాట్లకు దూరంగా ఉండాలి. ఆరోగ్య పరిస్థితిని, లక్షణాలను ఎప్పటికపుడు గమనించుకుంటూ ఉండాలి. వ్యాయామం, మెడిటేషన్ వంటి వాటికి సమయంకేటాయించాలి. ఒకవేళ ఏదైనా సమస్య తలెత్తితే నిర్లక్ష్యం చేయకుండా, సమస్య ఏదైనా వైద్యుల ద్వారా నిర్ధరించుకుని సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. -
ఉసురు తీస్తున్న పసరు
ఆ గ్రామాల్లో నాటు వైద్యం చిన్నారులను చిదిమేస్తోంది. మారుమూల గ్రామాలు కావడం, మెరుగైన వైద్యం అందుబాటులో లేకపోవడంతో నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ఆ మందులు వికటించి కొందరు.. సమయానికి వైద్యం అందక మరికొందరు మృత్యువాత పడుతున్నారు. ఏడాదిలో 14 మంది చిన్నారులు మత్యువాతపడ్డారు. ప్రస్తుతం మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. సాక్షి, తిరుపతి/కేవీబీపురం: సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండల పరిధిలోని పలు గ్రామాలు పట్టణాలకు దూరంగా అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ గ్రామాలకు కోవనూరు, కేవీబీపురంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. పీహెచ్‌సీలకు వెళ్లాలంటే 8 కి.మీ దూరం ఉంది. అక్కడకు వెళ్లినా మెరుగైన వైద్యం అందే పరిస్థితి లేదు. 24 గంటల ఆస్పత్రి అయినా వైద్యులు ఉండరు. ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి. ప్రతి బుధ, శనివారాల్లో చిన్నారులు, గర్భిణులకు వ్యాక్సిన్లు వేయాల్సి ఉన్నా ఆ దాఖలాలు లేవని బస్సులు, ఆటోలు అందుబాటులో లేకపోతే బైక్‌పై తీసుకెళ్లాలి. లేదంటే గ్రామంలోనే ప్రాణాలు విడవాల్సిన పరిస్థితి. జయలక్ష్మి కాలనీకి చెందిన దంపతులకు నాలుగేళ్ల తర్వాత కలిగిన మగబిడ్డకు జబ్బు చేసింది. పెద్దలు చెప్పారని నాటు మందులు వాడారు. బిడ్డకు ఊపిరితిత్తుల సమస్య ఏర్పడింది. పాలు పట్టిస్తే నేరుగా ఊపిరితిత్తులకు చేరి వాపు రావడంతో భయంతో వారం రోజుల పాటు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. డబ్బులు ఖర్చు చేసినా ప్రయోజనం లేకపోయింది. కొన్ని రోజులకు బిడ్డ చనిపోయాడు. బైరాజుకండ్రిగకు చెందిన రెండేళ్ల వయస్సు ఉన్న పాపకు ఎక్కిళ్లు ఎక్కువ కావడంతో గ్రామంలోని పెద్దావిడ మాటలు విని ఆకు పసరు మందు తాగించారు. తీవ్రమైన దగ్గు, ఆయాశంతో పాటు నోటి నుంచి రక్తం కారడం మెదలైంది. చాలా ఆస్పత్రులు తిరిగారు. ఊపిరితిత్తులు పూర్తిగా పాడవడంతో ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. కామెర్లని నుదురు, చేతిపై కాల్చారు దిగువపుత్తూరుకు చెందిన సుప్రియకు చెందిన ఏడాదిన్నర బిడ్డ ఏసుకు కామెర్ల వ్యాధి సోకింది. స్థానిక ఆచారాలు, పెద్దలు చెప్పిన మాట విని ఆ తల్లి నాటు వైద్యుడి చేత చిన్నారి నుదురు, చేతిపై ఇనుప కమ్మిని ఎర్రగా కాల్చి పెట్టించింది. అనంతరం ఆకు పసరు ఇచ్చారు. తొమ్మిది రోజుల తర్వాత ఏసు మరణించింది. సరైన సమయంలో వైద్యం అందక కేవీబీపురం మండలం ఎస్‌ఎల్‌పురం గ్రామానికి చెందిన శ్యామల బిడ్డకు ఎనిమిది నెలల వయస్సులో జ్వరం వచ్చింది. నాటు మందులు వాడాల్సి వచ్చింది. నాలుగు రోజుల తర్వాత కడుపు బాగా ఉబ్బిపోయింది. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సమయానికి వైద్యం అందకపోవడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ చెయ్యి జారిపోయాడు. స్థానికులు చెబుతున్నారు. మెరుగైన వైద్యం కోసం పట్టణాలకు వెళ్లాలంటే 30 కి.మీ దూరంలోని శ్రీకాళహస్తి, 48 కి.మీ దూరంలో ఉన్న తిరుపతికి పరుగులు తీయాల్సి వస్తోంది. చికిత్స పొందుతున్న చిన్నారులు పెరిందేశం గ్రామానికి చెందిన ఇంకా పేరు పెట్టని 53 రోజుల చిన్నారి, లిఖిత (7నెలలు) తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్నారు. ఇందులో లిఖిత పరిస్థితి విషమంగా ఉంది. కొప్పేడుకు చెందిన 18 నెలల మోక్షిత, బంగారమ్మకండ్రిగకు చెందిన రెండున్నరేళ్ల వరలక్షి్మ, సరస్వతీకండ్రిగకు చెందిన రోహిణి (17 నెలలు) పుత్తూరు చిన్నపిల్లల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తాను సమస్య నా దృష్టికి రాలేదు. సంబంధిత పీహెచ్సీ పరిధి నుంచి డేటా తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాను. సచివాలయాల ద్వారా ఈ వారంలోపు 372 మంది ఏఎన్ఎంల నియామకాలు జరుగుతాయి. సోమవారం నుంచి వారికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నాం. – పెంచలయ్య, డీఎంహెచ్ఓ -
వామ్మో.. స్వైన్‌ఫ్లూ
మొయినాబాద్: స్వైన్‌ఫ్లూ సోకి చికిత్స పొందుతున్న రైతు మృత్యువాత పడడంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మొయినాబాద్‌కు చెందిన రైతు ఆసిఫ్(29) మృతితో మొయినాబాద్ మండల కేంద్రంలో శనివారం తీవ్ర కలకలం రేగింది. ఈనెల 6న ఆసిఫ్‌కు జ్వరం రావడంతో కుటుంబీకులు నగరంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు చేసి స్వైన్‌ఫ్లూ సోకిందని నిర్ధారించి చికిత్స అందించసాగారు. పరిస్థితి విషమించడంతో రైతు శుక్రవారం రాత్రి చనిపోయాడు. ఆసిఫ్‌కు స్వైన్‌ఫ్లూ సోకిందనే విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు వారం రోజుల క్రితం ఇళ్లు వదిలివెళ్లారు. మొయినాబాద్‌లోని ప్రభు త్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు పట్టుబట్టారు. కొందరు తల్లిదండ్రులు శనివారం తమ పిల్లలను స్కూళ్లు, కాలేజీలకు పంపలేదు. విద్యార్థులు మాస్క్‌లు ధరించి స్కూళ్లకు వెళ్తున్నారు. పెద్దలు కూడా మాస్క్‌లతో బయటకు వెళ్తున్నారు. శనివారం నలుగురు ఓ చోట కలిస్తే ‘స్వైన్‌ఫ్లూ’ విషయమే మాట్లాడుతూ కనిపించారు. మూడు రోజుల క్రితం.. మూడు రోజుల క్రితం మొయినాబాద్‌కు చెందిన మహ్మద్ ఇమ్రాన్(30) అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఆయన పచ్చకామెర్ల వ్యాధితో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇమ్రాన్‌కు పది రోజల క్రితం జ్వరం రావడంతో కుటుంబీకులు నగరంలోని ఓవైసీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు గురువారం మృతి చెందాడు. అతడి అంత్యక్రియలు స్వస్థలం రాజేంద్రనగర్ మండలంలోని నార్సింగిలో నిర్వహించారు. ఇమ్రాన్ భార్య నూర్జహాన్(25) సైతం అనారోగ్యంతో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. కాగా దంపతులకు స్వైన్‌ఫ్లూ సోకి ఉండొచ్చని మొయినాబాద్‌లో పుకార్లు వ్యాపించాయి. ఆసిఫ్ పొరుగింట్లో ఉండే వృద్ధురాలు లక్ష్మి(65)కి ఇటీవల జ్వరంతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె ఎక్కడికి వెళ్లిందో ఎవరికి తెలియలేదు. ఆమెకు కూడా స్వైన్‌ఫ్లూ సోకి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. కాగా ఆసిఫ్ వ్యవసాయంతో పాటు పలు సంతలు తిరుగుతూ పశువుల క్రయవిక్రయాలు జరుపుతుండేవాడు. ఈక్రమంలో ఆయనకు స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకి ఉంటుందని స్థాని కులు అనుమానిస్తున్నారు. భయంభయం.. శనివారం ఆసిఫ్ అంత్యక్రియలు మండల కేంద్రంలో నిర్వహించారు. స్థానికంగా ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించొద్దని కొందరు స్థానికులు తహసీల్దార్ గంగాధర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. గృహ సముదాయాల మధ్య ఉన్న శ్మశానవాటికలో ఆసిఫ్ మృతదేహాన్ని ఖననం చేయడంతో ఇరుగుపొరుగు ఇళ్ల వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమకు కూడా వ్యాధి వ్యాపిస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. చేసేది లేక.. కొందరు తమ ఇళ్లను ఖాళీ చేసి బంధువుల వద్దకు వెళ్తున్నారు. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతుండడంతో అవగాహన కల్పించాల్సిన అధికారులు పత్తా లేకుండా పోయారు. ఆసిఫ్‌కు స్వైన్ ఫ్లూ సోకిందనే విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న చేవెళ్ల ఏరియా వైద్యాధికారి చెంచయ్య ఈనెల 13న మొయినాబాద్‌ను సందర్శించారు. ఆసిఫ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి నివారణ మాత్రలు అందజేశారు. వైద్యాధికారులు ఎటువంటి చర్యలు చే పట్టలే దు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందిం చాల్సి ఉంది.