వైద్యం.. దూరం..దూరం
కర్నూలు విద్య: పథకం ఎంత మంచిదైనా, గొప్పదైనా.. ఆచ రణలో విఫలమైతే ప్రయోజనం ఉండదు. రేపటి పౌరులైన నేటి విద్యార్థులకు వైద్య సేవలు అందజేయడానికి ఉద్దేశించిన జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం కూడా నీరుగారిపోతోంది. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుతో పాటు మిగతా రంగాల్లో కూడా రాణిస్తారనే ఉద్దేశంతో 2010 నవంబర్ 10న అప్పటి ప్రభుత్వం జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకానికి శ్రీకారం చుట్టింది.
కేంద్రం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు వచ్చాక బాల ఆరోగ్య రక్ష పథకం ద్వారా పేద విద్యార్థులకు మరింత మెరుగ్గా వైద్య సేవలు అందించేందుకు జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకాన్ని ఇటీవలే రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమంగా పేరు మార్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించి..అవసరమైతే మందులు, చికిత్స అందించి ఆరోగ్యవంతులైన విద్యార్థులుగా తీర్చిదిద్దడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
ఈ పథకం ప్రచార ఆర్భాటాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన పాలకులు అమలులో నిర్లక్ష్యం వహించడంతో ఆరోగ్య రక్ష పథకం అటకెక్కింది. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా అమలు చేస్తున్న ఆరోగ్య రక్ష పథకాన్ని సమర్ధవంతంగా నిర్వహించేందుకు విద్య, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయం చేసుకోవాల్సి ఉంది. వివిధ శాఖల మధ్య కొరవడిన సమన్వయం వల్ల ఏ విద్యార్థి ఆరోగ్యంగా ఉన్నాడో.. ఏ విద్యార్థి ఏ వ్యాధితో బాధ పడుతున్నాడో ముందుగానే తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది.
పథకం పేరు మార్పుతోనైనా.. ప్రయోజనం కలిగేనా..!
జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ప్రవేశపెట్టిన జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకంలో 6-14 సంవత్సరాల వయస్సు ఉన్న విద్యార్థులకు వైద్య సేవలు అందించేవారు. ఈ పథకం ద్వారా మరింత మంది పేద విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా ఇటీవలే బాల ఆరోగ్య రక్ష పథకాన్ని 0 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమంగా పేరు మార్చారు.
విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు, నీరు తాగడం వల్ల సాధారణంగా పిల్లలు అనారోగ్యం పాలవుతుంటారు. దీని వల్ల పిల్లలు పాఠశాలలకు సరిగా హాజరు కాలేకపోతున్నారు. దీన్ని నివారించి.. స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలంటే ముందుగా విద్యార్థుల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందనే నమ్మకాన్ని వారికి కల్పించాలి. వీటి కోసమే ప్రభుత్వం ఆరోగ్యరక్ష కార్డులు జారీ చేస్తుంది. 1-10వ తరగతి విద్యార్థులకు ప్రతి నెల ప్రతి విద్యార్థి ఆరోగ్య వివరాలు కార్డుల్లో నమోదు చేయాలి. పథకం ప్రారంభంలో ఆర్భాటంగా కార్డులు అందజేసిన అధికారులు ఆ తరువాత విద్యార్థుల హెల్త్ చెకప్ చేయడమే మరిచిపోయారు.
గతేడాది అడపాదడపా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యారోగ్య శాఖకు చెందిన వైద్యులు ఈ ఏడాది ఇంతవరకు ఏ స్కూల్లో కూడా వైద్య పరీక్షలు నిర్వహించలేదని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ పథకం అమలు కోసం ఉన్న ప్రత్యేక ఆరోగ్య కమిటీలకు జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గాను, వైద్యారోగ్య శాఖ జిల్లా అధికారి, జిల్లా విద్యాధికారి సభ్యులుగాను, మండల స్థాయిలో ఎంపీడీఓ చైర్మన్, ఎంఈఓ, పీహెచ్సీ వైద్యులు సభ్యులుగా ఉంటారు. ఈ ప్రత్యేక కమిటీలు ఏ రోజు కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించిన, సమీక్షించిన దాఖలాలు లేవు. అసలు ఈ కమిటీలు పని చేస్తున్నాయో లేదో కూడా ఎవరికీ తెలియడం లేదు. ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. పథకం ఇలా ఉంటే విస్తరించినా ప్రయోజనం శూన్యమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అందని కార్డులు...
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 15 శాతం మంది కూడా ఈ ఏడాది ఆరోగ్య రక్ష కార్డులు పంపిణీ చేయలేదు. జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, మండల, జిల్లా పరిషత్, గురుకుల, సోషల్ వెల్ఫేర్, మోడల్, నవోదయ తదితర స్కూల్స్ 4021 ఉండగా వీటిలో 6,93,520 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో ఈ ఏడాది 1 నుంచి 5 తరగతులకు చెందిన విద్యార్థులకు 56 వేలు, 6 నుంచి 10 తరగతులకు చెందిన 60 వేల మంది విద్యార్థులకు, ఈ విద్యా సంవత్సరం నుంచి 20 వేల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు మాత్రమే ఆరోగ్య రక్ష కార్డులను అందజేశారు. అయితే ఎక్కడ కూడా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు రికార్డుల్లో నమోదు చేయలేదని విమర్శలు ఉన్నాయి.