ఇళ్ల కోసం...ఏళ్ల పోరాటం!
17 వేల కుటుంబాలు... 20 ఏళ్ల పోరాటం...
ధర్నాలు, వినతులు, హామీలు.. 158 రోజుల సుదీర్ఘ దీక్ష..
ఇదంతా జానెడు జాగ కోసం.. నిలువ నీడ కోసం
జవహర్‌నగర్ ప్రజల సమస్య.. ప్రతి ఐదేళ్లకు ఓటుబ్యాంకు రాజకీయమైంది. మూకుమ్మడిగా మద్దతిస్తే మీకందరికీ పట్టాలిస్తాం.. అంటూ ప్రతి ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులకు ఓ ఆయుధమైంది. 50వేల పైచిలుకు ఓట్లున్న ఇక్కడి ప్రజలు ప్రతిసారీ మోసపోతూనే ఉన్నారు. కలిసి వచ్చే పార్టీలు, సంఘాలతో ఉద్యమిస్తున్నా.. యూనియన్లు కట్టి నిరంతరం పోరాడుతున్నా.. కనికరం లేని ప్రభుత్వం, చిత్తశుద్ధిలేని అధికారయంత్రాంగం ఏమీ పట్టనట్టు కళ్లుమూసుకుంది. సమస్యను తేల్చక జఠిలం చేస్తున్న తీరుపై మహిళలు సైతం గళమెత్తుతున్నారు. - న్యూస్‌లైన్, జవహర్‌నగర్
జవహర్‌నగర్, న్యూస్‌లైన్: పేదలకు గూడు కల్పించడం ప్రభుత్వం బాధ్యత, కనీసం ఇంటిస్థలమైనా కేటాయించాలి. ప్రభుత్వం ఈ బాధ్యతను విస్మరించడంతో నిలువ నీడ లేని వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం కనికరించి తమ గూడుకు భరోసా కల్పిస్తూ పట్టాలు ఇస్తుందనే ఆశ వారిది. ఆ ఆశతోనే జవహర్‌నగర్‌లో గుడిసెలు వేసుకున్న వారు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఉపాధి కోసం నగరానికి వలస వచ్చిన వేలాదిమంది జవహర్‌నగర్‌లో కనీస వసతులకు నోచుకోకపోగా ఉంటున్న గుడిసెల స్థలాలకు పట్టాలు అందక బిక్కుబిక్కుమంటూ జీవితాలు కొనసాగిస్తున్నారు. పేదల అవసరాలను పరిగణనలోకి తీసుకోకపోవడం, సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం చూపుతుండటం వారిపట్ల శాపంగా మారింది.
వీరి గోడు పట్టదా?
జవహర్‌నగర్‌లోని పలు కాలనీలలో పేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. ఇప్పటికి పదేళ్లు దాటినా వారిలో అర్హులను గుర్తించి అక్కడో.. మరో చోటనో స్థలాలను కేటాయించాల్సిన అధికారయంత్రాంగం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. జవహర్‌నగర్‌లో 22వేల ఇళ్లకు పట్టాలిస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకూ ఆ ఊసే ఎత్తడం లేదు. తమకు నివాస హక్కు కల్పించాలని 50 వేల పైచిలుకు ఉన్న పేదలు గత సంవత్సరం పంచాయతీ కార్యాలయం ఎదుట 158రోజులు నిరాహార దీక్షలు చేసినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. తాగునీరు, విద్యుత్ వంటి కనీస వసతులు కూడా లేక పేదల దయనీయ పరిస్థితుల్లో జీవనాన్ని గడుపుతున్నారు. కనీస వసతులు కల్పించాలని పలుమార్లు ధర్నాలు చేసినా ఫలితం లేకపోయింది.
పట్టాలిచ్చే వరకూ పోరాటం
జవహర్‌నగర్‌లో ఉంటున్న వారందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామన్న హామీని నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై సర్వేలు చేయించింది తప్ప నివాస హక్కు కల్పించడం లేదు. వారందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చేంతవరకూ పోరాటాన్ని కొనసాగిస్తాం.
- తూరుగొండ రామన్న మాదిగ, మాదిగ మహాజన సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు
న్యాయం చేయాలి...
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వేలాదిమంది జవహర్‌నగర్‌లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో కనీస వసతులు లేక పేదలు అష్టకష్టాలు పడుతున్నారు. కనీసం వారందరికీ ఇళ్ల పట్టాలిచ్చైనా ప్రభుత్వం న్యాయం చేయాలి.
- గున్నా సంధ్య, ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ సంఘం జవహర్‌నగర్ అధ్యక్షురాలు
ఇంటిపన్ను వసూలు చేయాలి
జవహర్‌నగర్ గ్రామంలో 25వేల ఇళ్లు ఉంటే, కేవలం 8వేల ఇళ్లనుంచే ఇంటిపన్నులు వసూలు చేస్తుండటంతో మిగతా వారు ఇళ్లపై హక్కెక్కడ పోతుందోనని ఆందోళన చెందుతున్నారు. అన్ని ఇళ్లనుంచి ఇంటిపన్నులు తీసుకునేంత వరకూ దీక్షలను ఆపేది లేదు.
- చ ంద్రమౌళి, జవహర్‌నగర్
అఖిలపక్ష కన్వీనర్
గ్రామకంఠంగా గుర్తించాలి
జవహర్‌నగర్‌లోని 6వేల ఎకరాలను గ్రామకంఠంగా గుర్తించాలి. ప్రభుత్వం మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడేది లేదు. గ్రామకంఠంలో కలిపే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. పేద ప్రజలకు నివాస హక్కు కోసం అవసరమైతే భూపోరాటం చేస్తాం.
- ఎన్.బాలమల్లేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి