వైభవంగా ‘జయ’ ఉగాది
అన్నానగర్, న్యూస్‌లైన్: మెరీనా తీరంలో జయనామ ఉగాదిని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం స్థానిక మద్రాసు వర్సిటీ తెలుగు విభాగం, దక్షిణ భారత తెలుగు సంక్షేమ సంఘం సాహితీ విభాగం, నవసాహితీ కలిసి మెరీనా రజతోత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జయ ఉగాది వేడుకలకు ప్రముఖ వైద్యుడు సీఎంకే రెడ్డి విశిష్ట అతిథిగా విచ్చేసి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు.
రాబోయే జయ ఉగాది అందరికీ మంచి చేయాలని ఆయన అభిలషించారు. మరో విశిష్ట అతిథి పెరియార్ విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడు తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ, కొత్త ఆశలు, ఆశయాలతో జయ నామ ఉగాదిని ప్రారంభించాలన్నారు. ఆత్మీయ అతిథి హోదాలో వచ్చిన దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కాట్రగడ్డ ప్రసాద్ ప్రస్తుతం మనమంతా జయ(అమ్మ) రాష్ట్రంలో ఉన్నాం గనుక జయానికి ఎదురులేదని చలోక్తి విసిరారు.
ప్రసంగాల అనంతరం అంతర్జాతీయపురస్కారం పొందిన చిత్రం మిణుగురులు సంగీత దర్శకుడు జోస్యభట్ల రాజశేఖర శర్మ, చిత్ర దర్శకుడు కె.అయోధ్యకుమార్‌కు కాట్రగడ్డ, సీఎంకే రెడ్డి, అఖిల భారత చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు రవికోటార్కర్ అభినందన చందనం పేరిట ఘనంగా సత్కరించారు. పురస్కారం అందుకున్న శర్మ, అయోధ్యకుమార్ మాట్లాడు తూ, మద్రాసులోని తెలుగు వారికి రుణపడి పోయామన్నారు. ఈ ఉగాదిని చెన్నైలో తెలుగు వారి మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.
డాక్టర్ వై బాలశౌరి రెడ్డి, గోటేటి శ్రీరామారావు, ఇ.ఎస్ రెడ్డి, ఆచార్య ఎల్.బి. శంకరరావు, కాకాని వీరయ్య, గంగరాజు మోహనరావు, ఇట్టా సాంబశివరావు, విద్వాన్ ఎస్ దశరథరామిరెడ్డి, ఆచార్య జీవీఎస్ఆర్ కృష్ణమూర్తి, ఆచార్య డి.చిన్ని కృష్ణయ్య, డాక్టర్ పుల్లూరి ఉమ, సరోజినీ ప్రేమ్‌చంద్, పుట్టా జయరామ్, సిహెచ్ వెంకటేశ్వరరావు వంటి సీనియర్ తెలుగు ప్రముఖులకు మాడభూషి సంపత్ కుమార్, నవ సాహితి కార్యదర్శి ఎస్వి సూర్యప్రకాశరావు, అధ్యక్షుడు దోర్నాదుల సత్యనారాయణ నేతృత్వంలో వేదికపైనున్న విశిష్ట అతిథులు ఘనంగా సన్మానించారు.
సాయంత్రం 5 గంటలకు 44 మంది ప్రముఖ కవులతో ఉగాది కవితా సమేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనంలో దశరథరామిరెడ్డి, వీరయ్య, గంగరాజు మోహనరావు, ఎల్.బి.శంకరరావు, చిన్ని కృష్ణయ్య, జివిఎస్ఆర్ కృష్ణమూర్తి, కాసల నాగభూషణం, ఉప్పలధడియం వెంకటేశ్వర్లు, గుడిమెట్ల చెన్నయ్య, వంజరపు శివయ్య, ఎ.వి శివకుమారి, వెన్నెలకంటి, సరోజినీ ప్రేమ్‌చంద్, విస్తాల శంకరరావు, కె.లక్ష్మణ, ప్రణవి, తమిళ్‌సెల్వి, ఎస్వి. సూర్య ప్రకాశ రావు, పి.ఆర్. కేశవులు, ఎం.గంగాధర ప్రసాద్, జె.కె.రెడ్డి, మొదలి శ్రీరామప్రసాద్, ఎం. కళ్యాణి, వె.వి.ఎస్.ఎస్.ఎన్.మూర్తి, వై.వి రాజారావు, వారణాశి శివరామకృష్ణ, కోట శ్రీరామచంద్రమూర్తి, భువనచంద్ర, ఎస్.బషీర్, టి.మోహనశ్రీ, ఉప్పలూరి విజయలక్ష్మి, కె.ఎం వీరేశ్, పి.గోపాల్, జి.ఎన్.శ్యామల, అంబృణి, ఎలిజబెత్ జయకుమారి, ఎం.మునిరత్నం, డి.వేలాయుధం, అద్దేపల్లి సుచిత్రాదేవి, పి.ఎస్. మైథిలి, బాలసుబ్రమణ్యం, ఈశ్వర కంబార, కె. శశికుమార్, ఒ.బసవరాజ్ వంటి కవులు పాల్గొని ఉగాది ప్రాశస్త్యాన్ని తెలిపే పలు కవితలను చదివారు.
ఈ కవితా సమ్మేళనానికి చెన్నై ఆకాశవాణి తెలుగు విభాగం అధికారి డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ కవితానుశీలన కర్తగా వ్యవహరించారు.దీనికి వై.వి.ఎస్.ఎస్.ఎన్.మూర్తి, మల్యాది, జేకేరెడ్డి, ఇ.ఎస్. రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రముఖ పురోహిత ద్వయం అశ్వినీ-రోహిణీ శాస్త్రీ తమ పంచాంగ శ్రవణంతో ప్రారంభించారు. మాడభూషి సంపత్ కుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు.