ఆర్టీసీ బస్టాండులో మహిళ ప్రసవం
తల్లీబిడ్డ సురక్షితం
తాడిపత్రి టౌన్ : స్థానిక ఆర్టీసీ బస్టాండులో బుధవారం ఉదయం ఓ మహిళ మగ శిశువును ప్రసవించింది. స్థానిక ఆర్టీసీ అధికారులు స్పందించి సకాలంలో ప్రసవం చేయించి, 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో తల్లీబిడ్డ సురక్షితంగా ఉన్నారు. స్థానిక ఆర్టీసీ అధికారుల కథనం ప్రకారం...వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం చెవిటిపల్లికి చెందిన లింగమయ్య, జయలక్షుమ్మ భార్యభర్తలు. జయలక్షుమ్మ గర్భిణి కావడంతో వైద్యం కోసం రెండు రోజుల క్రితం బత్తలపల్లి ఆస్పత్రికి వెళ్లారు. అయితే ప్రసవానికి వారం రోజులు సమయం పడుతుండని వైద్యులు చెప్పడంతో చెవిటిపల్లికి తిరిగి వెళ్లిపోయారు.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి నుంచి నొప్పులు రావడంతో బుధవారం ఉదయం పులివెందుల నుంచి తాడిపత్రికి వస్తున్న ఆర్టీసీ బస్సులో బత్తలపల్లికి బయలుదేరారు. తాడిపత్రి బస్టాండుకు రాగానే జయలక్షుమ్మకు నొప్పులు అధికం కావడంతో ఆమె భర్త అర్టీసీ అధికారులకు విషయం తెలిపారు. ఆర్టీసీ అధికారులు శశిభూషణ్, నాగభూషణం, హరిత, స్థానిక మహిళల సహకారంతో బస్టాండులోనే ప్రసవం చేశారు. అనంతరం 108లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.