జయలలితపై ఫేస్బుక్లో వదంతులు.. యువతిపై కేసు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేసినందుకు ఆ రాష్ట్రానికి చెందిన ఓ ఎన్నారై యువతిపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. జయలలిత రెండు రోజుల క్రితమే మరణించినట్లు తనకు విశ్వసనీయ సమాచారం అందిందని ఫ్రాన్సులో నివసించే తమిళచి అనే యువతి తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. తమిళనాడులో అల్లర్లు సృష్టించడానికి ఆర్ఎస్ఎస్ వర్గాలే ఆమెను హత్యచేశాయని కూడా ఆమె ఆరోపించారు. ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసు, వీహెచ్‌పీ నేత సూరి హత్యకేసు, హిందూ మున్నానీ నాయకుడు శశికుమార్ కేసు.. వీటన్నింటినీ కూడా ఆమె తన పోస్టులో ప్రస్తావించింది.
ఈ కేసుల్లో ముస్లింలపై ఆరోపణలు చేశారని.. ఆర్ఎస్ఎస్ వాళ్లు హిందూ ముస్లిం అల్లర్లు రెచ్చగొట్టబోతే జయలలిత అడ్డం పడ్డారని, అందుకే ఆమెను కూడా వాళ్లు చంపేశారని ఆమె తన ఫేస్బుక్లో రాసింది. జయలలిత ఆరోగ్యం గురించిన వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని కూడా ఆమె కోరారు. దీంతో జయలలిత ఆరోగ్యం గురించి వదంతులు ప్రచారం చేస్తున్నారంటూ అన్నాడీఎంకే ఐటీ విభాగం ఆమెపై ఫిర్యాదుచేసింది. క్రైం బ్రాంచి విభాగం పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్లు 153ఎ, 505 (1), (2) కింద కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 22వ తేదీన జయలలిత తీవ్రజ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు.