తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
న్యూఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ బుధవారం నోటీసులు ఇచ్చింది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరు ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తూ సాంబారు పాత్రలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయ్యింది. ఇందుకు సంబంధించి ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.
కాగా ఒకటో తరగతి చదువుతున్న బల్కూరి జయవర్ధన్(5) శుక్రవారం (డిసెంబర్ 23) మధ్యాహ్న భోజనం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులంతా వరుసలో నిలుచున్నారు. ఈ క్రమంలో వెనుకనున్న విద్యార్థులు తోసుకోవడంతో ముందున్న జయవర్ధన్ ఒక్కసారిగా వేడి సాంబారు ఉన్న పాత్రలో పడిపోయాడు. దీంతో తల, ముఖ భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఉపాధ్యాయులు వెంటనే స్పందించి అతడిని చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జయవర్థన్ శనివారం ఉదయం మృతి చెందాడు.