జేసీ వివేక్ సేవలు ప్రశంసనీయం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ జిల్లాలో చేసిన సేవలు ప్రశంసనీయమని మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. జేసీ వివేక్ యాదవ్ విజయనగరం జిల్లా కలెక్టర్గా పదోన్నతిపై వెళుతున్న సందర్భంగా గురువారం రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జేసీ తక్కువ కాలంలో జిల్లాలో పలు విభాగాల్లో సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. పౌర సరఫరాల శాఖ, మీసేవ, ఈ పాస్, వంశధార, కొవ్వాడ, తోటపల్లి ప్రోజెక్టులు భూసేకరణ తదితర అంశాల్లో ఆయన మంచి సేవలు అందించారని తెలిపారు. ఎమ్మెల్సీ కావలి ప్రతిభాభారతి, కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, జేసీ–2 పి.రజనీకాంతారావు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, డీఆర్ఓ బి. కృష్ణభారతి, ఐటీడీఏ పీఓ జె.వెంకటరావు, డీఆర్డీఏ పీడీ ఎస్.తనూజారాణి, జెడ్పీ సీఈఓ నగేష్, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.