ఎంపీ ఇల్లు ముట్టడి
తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: తిరుపతి ఎంపీ చింతామోహన్ ఇంటిని ఆర్టీసీ, రెవెన్యూ, మెడికల్, ఉపాధ్యాయ జేఏసీ(ఉద్యోగ జేఏసీ) సమైక్యవాదులు ముట్టడించారు. శుక్రవారం కపిలతీర్థం మార్గంలోని రామచంద్రానగర్ ఉన్న ఎంపీ నివా సం వద్దకు ఆర్టీసీ జేఏసీ నాయకులు మునిసుబ్రమణ్యం, ప్రకాష్, సురేంద్రబాబు, లతారెడ్డి, పీసీబాబు, ఎన్జీవో జేఏసీ నాయకులు నరసింహారెడ్డి, మంజూనాథ్, కోటీశ్వరరావు, సురేష్, విజయలక్ష్మి, నిర్మల, ఉదయలక్ష్మి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో ఇంటి ముందు బైఠాయించి ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వీరికి వైఎస్సార్ సీపీ నాయకుడు వరప్రసాద్‌రావు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. ఎంపీ రాజీనామా చేయకుంటే ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆయన ఊర్లో లేని సమయంలో ఆందోళన చేయడం సరికాదని, వెళ్లిపోవాలని సూచించారు. వరప్రసాద్‌రావు, మునిసుబ్రమణ్యం మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంతం నుంచి దళిత, బడుగు, బలహీన వర్గాల ఓట్లతో గెలిచిన ఎంపీ చింతామోహన్ వారిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.
సీమాంధ్ర ఉనికికే ప్రమాదకరంగా మారిన రాష్ట్ర విభజన ప్రకటనను వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కరూ ఆందోళన చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రజల సంక్షేమాన్ని చూడాల్సిన ఎంపీ విభజన ప్రకటన వచ్చినప్పటి నుంచి కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు. మరో ఆరు నెలల్లో ఊడిపోయే పదవి కోసం ఎంపీ చింతా పాకులాడడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా ఆయన తన పదవికి రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. ఎంపీని ఇండిపెండెంట్‌గానైనా గెలిపించి తిరిగి చట్టసభకు పంపిస్తామని సమైక్యవాదుల తరఫున బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏపీఎన్జీవో నాయకులు ఆంజేయులు, శేషారెడ్డి, కిరణ్, బాలాజి, భారతి, గోపాల్ హాజరయ్యారు.