Jet Set .. Go ..
-
ఎయిర్ ట్యాక్సీ...రూ.12కే విమాన ప్రయాణం..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కిలోమీటరుకు రూ.12 చార్జీ. అదీ ఎయిర్ ట్యాక్సీలో. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్–ఆఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటోల్) ఎయిర్‌క్రాఫ్ట్స్‌తో ఇది సాధ్యమని జెట్ సెట్ గో చెబుతోంది. అద్దెకు ప్రైవేట్ విమానాలను నడుపుతున్న ఈ సంస్థ ఈవీటోల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ద్వారా ఎయిర్ ట్యాక్సీ రంగంలోకి రావాలని కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం రెండు తయారీ సంస్థలతో మాట్లాడుతున్నామని జెట్ సెట్ గో ఏవియేషన్ సర్వీసెస్ ఫౌండర్ కనిక టేక్రివాల్ రెడ్డి వెల్లడించారు. తొలుత హైదరాబాద్, ఆ తర్వాత ముంబై, బెంగళూరులో ఎయిర్ ట్యాక్సీ సేవలు పరిచయం చేస్తామన్నారు. బేగంపేట విమానాశ్రయంలో గురువారం ప్రారంభమైన వింగ్స్ ఇండియా–2022 సందర్భంగా ఆమె సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ఎయిర్ ట్యాక్సీ, కంపెనీ, పరిశ్రమ గురించి ఆమె మాటల్లో.. మూడేళ్లలో సాకారం.. ప్రపంచవ్యాప్తంగా 12 సంస్థలు ఈవీటోల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ తయారీలో ఉన్నాయి. వీటిని నడపడానికి పైలట్ అవసరం లేదు. పైకి లేచినప్పుడు, కిందకు దిగేప్పుడు నిటారుగా ప్రయాణిస్తాయి. ల్యాండింగ్, టేకాఫ్ కోసం ల్యాండింగ్ ప్యాడ్స్ అవసరం. ఒక్కో ట్యాక్సీలో నలుగురు ప్రయాణించవచ్చు. ఒకసారి చార్జింగ్‌తో 40 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. కిలోమీటరుకు అయ్యే చార్జీ రూ.12 మాత్రమే. ఈవీటోల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఖరీదు సుమారు రూ.23 లక్షలు ఉంటుంది. ఎయిర్ ట్యాక్సీ సేవలను మూడేళ్లలో సాకారం చేస్తాం. ల్యాండింగ్ ప్యాడ్ 8 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు ఉంటే చాలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం. తొలి దశలో ఈ ప్రాజెక్టు కోసం రూ.1,900 కోట్లు ఖర్చు చేస్తాం. ఏవియేషన్ సెంటర్.. ప్రైవేట్ రంగంలో దేశంలో తొలి ఏవియేషన్ సెంటర్ హైదరాబాద్‌లో రూ.30 కోట్ల ఖర్చుతో మే నాటికి ఏర్పాటు చేస్తున్నాం. ప్రైవేట్ జెట్స్ పరిశ్రమకు అవసరమైన మానవ వనరులను ఈ కేంద్రం అందిస్తుంది. ప్రస్తుతం జెట్ సెట్ గో వద్ద 22 జెట్స్, 2 హెలికాప్టర్స్ ఉన్నాయి. 80 మంది పైలట్లు ఉన్నా రు. కొత్తగా ఈ ఏడాది నాలుగు జెట్స్, ఒక హెలికాప్టర్ జతకూడనున్నాయి. అద్దె గంటకు రూ.1.3 లక్షల నుంచి ప్రారంభం. 120 దేశాల్లోని 600లకుపైగా విమానాశ్రయాల్లో అడుగుపెట్టాం. రోజుకు సగటున 75 ల్యాండింగ్స్ నమోదు చేస్తున్నాం. రెండు నెలల్లో రూ.1,520 కోట్లు సమీకరిస్తున్నాం. తొలి స్థానంలో హైదరాబాద్.. ప్రైవేట్ జెట్స్ రాకపోకల విషయంలో దేశంలో భాగ్యనగరి తొలి స్థానంలో ఉంది. బేగంపేట విమానాశ్రయంలో కోవిడ్‌కు ముందు సగటున రోజుకు 2–3 ప్రైవేట్ జెట్స్ ల్యాండ్ అయ్యేవి. ఇప్పుడు 15 అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 250. భారత్‌లో ప్రైవేట్ వ్యక్తులు, కంపెనీల వద్ద 95 జెట్స్, హెలికాప్టర్స్ ఉన్నాయి. వీటిలో 7 తెలుగు రాష్ట్రాల వారివి. మా కంపెనీకి తెలంగాణ ప్రధాన మార్కెట్. విమానాలను పక్షులు ఢీకొట్టిన సంఘటనలు హైదరాబాద్‌లో నెలకు 15 వరకు ఉండగా, దేశవ్యాప్తంగా ఈ సంఖ్య నెలకు 1–2 మాత్రమే. రిపేర్‌కు రూ.15–23 కోట్ల ఖర్చు అవుతుంది. -
జెట్.. సెట్.. గో!
స్ఫూర్తి భారతదేశంలో ప్రైవేట్ జెట్‌ను అద్దెకు తీసుకోవటం కన్నా రోదసీ నౌకను అద్దెకు తీసుకోవటం సులభం అనే వ్యంగ్యోక్తి దేశీ విమానయాన పరిశ్రమలో తరుచు వినపడుతుండే రోజులివి. ఆ పరిస్థితుల్లో జస్ట్ ‘‘జెట్.. సెట్.. గో’’ అంటూ ప్రైవేట్ ఫ్లైట్ విహారంలో ఉండే మజాను భారతీయులు ఆస్వాదించేలా చేశారు కనికా తెక్రివాల్. ప్రైవేట్ ఫ్లైట్ వ్యాపారాన్ని గుప్పిటపట్టిన మాఫియాకు పాతికేళ్ల ప్రాయంలోనే ఆమె తన వ్యూహాలతో చెక్‌పెట్టారు. ఒకే ఏడాది ఫోర్బ్స్ ఆసియా 30, బీబీసీ 100 అత్యంత శక్తివంతులైన మహిళల జాబితాలో నిలిచి భారతీయ మహిళా కీర్తిని ఆకాశమంత ఎత్తున నిలబెట్టారు. జెట్‌సెట్‌గోను స్థాపించటం ద్వారా భారత ప్రైవేట్ విమానయాన రంగంలో నూతన అధ్యాయానికి నాంది పలికారు కనికా తెక్రివాల్. ఛార్టర్ప్లేన్స్ సంస్కృతిని మధ్య తరగతికి అందుబాటులోకి తెచ్చిన మొదటి సంస్థ జెట్‌సెట్‌గో. మొదట కనికా పెలైట్ కావటానికి ఇంట్లో ఒప్పుకోలేదు. తల్లిదండ్రులు చెప్పిన కారణం. అది అమ్మాయిలు చేసే పని కాదు అని. అప్పుడు కనికా వయసు 17 ఏళ్లు. కానీ తను పట్టు సడలించలేదు. ముంబైలో కాలేజీలో చదువుతూనే విమానయాన కంపెనీలో అప్రెంటీస్‌గా పని చేశారు. అనంతరం బ్రిటన్‌లో ఏవియేషన్ రంగంలో ఎంబీఏతో ఇండియా తిరిగొచ్చారు. ఆకాశయానంలో తారాపథానికి! చాలామంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు తరచూ మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వుంటుంది. నియోజకవర్గాల్లో పర్యటించటం, ఫ్యాక్టరీలను తనిఖీ చేయటం వంటి పనులు తక్కువ సమయంలో పూర్తి కావాలి. అందుకు ప్రైవేట్ జెట్ఫ్టైట్స్ ఒక్కటే వారికి ఉన్న మార్గం. ఈ రంగంలో అప్పటికి దళారులదే హవా. వారి క న్ను కమిషన్ పైనే తప్ప ఖాతాదారుల అవసరాలపై కాదు. ఖాతాదారులకు తమకు కావాలసిన విమానాలను, హెలికాప్టర్లను ఎంపిక చేసుకునే అవకాశం లేదు. చెప్పిన మొత్తం మారుమాట్లాడకుండా చెల్లించాల్సిందే. పెద్ద మొత్తం చెల్లించినా సేవలు మాత్రం నాసిరకంగా ఉండేవి. ఇట్లాంటి పరిస్థితుల్లో కనికా రంగప్రవేశం చేశారు. కంపెనీ స్థాపన కోసమని తను పొదుపు చేసుకున్న సొమ్ము కరిగిపోయింది. మరిన్ని నిధుల కోసం జరిగిన ప్రయత్నంలో క్రికెటర్ యువరాజ్‌సింగ్‌కు చెందిన యువికాన్ వెంచర్స్ మదుపు చేసేందుకు ముందుకొచ్చింది. ఎలాంటి సమీక్షలు, సంజాయిషీలు లేకుండానే 50 నిమిషాల సుదీర్ఘ ఫోన్ సంభాషణతో డీల్ ఓకే అయ్యింది. 2013లో జెట్‌సెట్‌గో ప్రారంభమైంది. విమానయానంలో కొత్త పుంతలు ‘నువ్వేమి చూస్తావో అదే పొందుతావు’ అనే సూక్తిని నమ్మే కనికా ప్రతికూలతలోను అవకాశాన్నే చూశారు. విమానయానానికి సంబంధించిన అన్ని రకాల సేవలను ఒక్కచోటే గుదిగుచ్చి అందించే ఆన్‌లైన వేదిక జెట్‌సెట్‌గోను సృష్టించారు. ఆన్లైన్లో వస్తువులకు ఆర్డర్ ఇచ్చినంత సులభంగా వెబ్ లేదా మొబైల్ ద్వారా విమానాలు, హెలికాఫ్టర్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఆన్లైన్ బుకింగ్ ప్రాసెస్‌ను సులభతరం చేశారు. అవసరాలు, పరిమితులను బట్టి విమానాలను ఎంపిక చేసుకునే సౌలభ్యం ఖాతాదారులకు కల్పించారు. చాలాసార్లు విమానం తిరుగుప్రయాణం ఖర్చును కూడా భరించాల్సి వస్తుంది. ఇక్కడే కనికా తన అనుభవాన్ని ఉపయోగించారు. తిరుగు ప్రయాణం ఖర్చును మరో ఖాతాదారుడికి బదిలీ చేసే అవకాశాలను పెంచారు. ఇంటి నుంచి కాలు బయటపెట్టింది మొదలు విమానాశ్రాయానికి రావటం, ఆన్‌బోర్డ్, గమ్య స్థానం చేర్చటం, ప్రయాణంలో వారు తీసుకునే ఆహారం వరకు ఇలా ప్రతి మజిలీలో అత్యంత నాణ్యమైన సేవలను అందించేలా కనికా జాగ్రత్తలు తీసుకున్నారు. చాలామంది వినియోగదారులు వీఐపీలు కావటం వల్ల ఎయిర్‌పోర్టులో బాడీగార్డ్‌లను ప్రత్యేకంగా తర్ఫీదు నిచ్చిన సిబ్బందిని సిద్ధంచేశారు. తక్కువ ధరకు సేవలు అందించటం.. ప్రయాణించిన దూరాన్ని మాత్రమే లెక్కించి ధర నిర్ణయించటం వంటి విధానాలు సంస్థను వినియోగదారులకు దగ్గర చేశాయి. ఫలితంగా మార్కెట్లో 80 శాతం వాటాను జెట్‌సెట్‌గో కైవసం చేసుకుంది. ఏటా 70 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. అయితే అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలైందంటారు కనికా. ప్రపంచ విమానయాన రంగంపై ఆధిపత్యానికై ఒప్పందాలు, భాగస్వామ్యాలతో జెట్‌వేగంతో పావులు కదుపుతున్నారు. పుట్టుకతో ఎవరూ విజేతలు కాదు ప్రయత్నంతోనేనని నిరూపించిన కనికా భారతీయ మహిళాలోకానికి మకుటాయమానం. కేన్సర్‌ను గెలిచిన కనికా! కలలు అందరు కంటారు. అవరోధాలను అధిగమించిన కొందరే వాటిని సాకారం చేసుకుంటారు. కనికా జీవితంలోకి ఆ అవరోధం కేన్సర్ రూపంలో వచ్చింది. అప్పుడామె వయస్సు 21 ఏళ్లు. చిన్నపాటి అనారోగ్యం అని భావించి హాస్పిటల్ చెకప్‌కు వెళితే బ్రెయిన్ క్యాన్సర్ అని తేలింది. నీకు చాలా తక్కువ సమయం ఉంది పనులు చక్కపెట్టుకోమన్న డాక్టర్‌పై కనికా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను బ్రతుకుతాను. మళ్లీ 40 ఏళ్ల తరువాత మిమ్మల్ని కలుస్తాను. చికి త్స కోసం కాదు నేను హాయిగా బ్రతికే ఉన్నానని నిరూపించటానికి’ అని డాక్టర్‌ను సవాల్ చేసి బయటకు వచ్చారు. ఏడాది పాటు రేడియోషన్, కీమోథెరపీలతో మనిషి శారీరకంగా కుంగిపోయారు కనికా. ఒళ్లంతా నొప్పులతో నిద్రలేని రాత్రులతో వేదనను అనుభవించారు. కానీ మానసికంగా మాత్రం కనికా చెక్కు చెదరలేదు. అలాంటి అర్థరాత్రిళ్లు ఆమె ఆలోచనల్లో ఊపిరి పోసుకుందే జెట్‌సెట్‌గో. తను కోలుకునే విషయంలో రెండో ఆలోచనకు తావివ్వలేదు. తన తో ఇదివరకటిలా ఉండాలని కుటుంబ సభ్యులకు నచ్చచెప్పారు. ఏడాది తిరిగేసరికి కేన్సర్‌నుంచి కోలుకున్నారు! పరామర్శకు వచ్చిన బంధువులు కీమోథెరపీ, శస్త్ర చికిత్సల వల్ల పెళ్లికి పనికిరాదనే అనుమానం వ్యక్తం చేశారు. నిత్యం ఇంట్లో ఇదొక తంతుగా మారటంతో విశ్రాంతికి స్వస్తి పలికి బ్యాగ్ సర్దుకుని భోపాల్‌ను వదిలారు. తన తర్వాతి గమ్యం ఢిల్లీ. - దండేల కృష్ణ