పట్టాలు తప్పిన జీలం ఎక్స్ప్రెస్
న్యూఢిల్లీ : పంజాబ్లోని సట్లేజ్ నది బ్రిడ్జి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జీలం ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 10 బోగీలు పట్టాలు తప్పగా... ముగ్గురు గాయపడ్డారు. ఈ మేరకు రైల్వే శాఖ ట్విట్టర్లో పేర్కొంది. ఫిలోర్ - లాడోవాల్ సెక్షన్ల మధ్య ఈ రైలు పట్టాలు తప్పిందని తెలిపింది.
ఈ ప్రమాదంపై సమాచారం అందగానే క్షతగాత్రులను లూథియానాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా ప్రయాణికులను తరలించడానికి మూడు బస్సులను ప్రమాద ఘటన స్థలికి చేరుకున్నాయని రైల్వే మంత్రిత్వశాఖ వివరించింది.
జీలం ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో మార్గంలో నడిచే నాలుగు ఎక్స్ప్రెస రైళ్లను తత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. జలంధర్ - న్యూఢిల్లీ, అమృత్సర్ - న్యూఢిల్లీ ఇంటర్ సిటీ, అమృత్సర్- హరిద్వార్ జనశతాబ్ధి ఎక్స్ప్రెస్, అమృత్సర్- ఛండీగడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు రద్దు అయినవి.