‘సంతోషం’ శరణం గచ్ఛామి
కొత్త కోణం
ఈ దేశాలన్నింటిలో బౌద్ధం అనుసరిస్తున్న ప్రజలు మెజారిటీగా ఉన్నారు. శాంతి, ప్రశాంతతతో కూడిన మానవాభివృద్ధిని ఇప్పటికే భూటాన్ ప్రతిపాదించింది. చాలా దేశాలు ఆ మార్గంలో ఉన్నాయి. ఆర్థికంగా ఈ దేశాలు అభివృద్ధి చెందిన కొద్దీ బౌద్ధం శక్తి కూడా ప్రపంచవ్యాప్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది గుర్తించడం వల్లనే ఎక్కడైతే బౌద్ధం పురుడుపోసుకొని అడుగులేసిందో ఆ భారతదేశంలోని రాజకీయ నాయకత్వాలు కూడా బౌద్ధం శక్తిని, బౌద్ధాన్ని అనుసరిస్తున్న దేశాల స్నేహాన్ని కాంక్షిస్తున్నాయి.
‘నాకు సంతోషం కావాలి’ అంటూ ఒక వ్యక్తి గౌతమ బుద్ధుడిని ఆశ్రయిం చాడు. అప్పుడు బుద్ధుడు ముందుగా నీ వాక్యంలోని ‘నాకు’ అనే పదాన్ని తొలగించు, అది అహానికి సంకేతం. అలాగే ‘కావాలి’ అనే పదాన్ని తొలగిం చుకో. అది కోరికకూ, ఆశకూ కొలమానం అన్నాడు. ఆ తరువాత నీకు మిగి లేది సంతోషం ఒక్కటే అని చెప్పాడు బుద్ధుడు. ఆ సమాధానం కేవలం ఆ వ్యక్తికి పరిమితం కాదు. సంస్థలకు, సమూహాలకు, రాజులకు, రాజ్యాలకు, ప్రభుత్వాలకు, పార్టీలకు అందరికీ వర్తిస్తుంది. మూడురోజుల క్రితం మనం బుద్ధ జయంతిని జరుపుకున్నాం. పలు ప్రపంచ దేశాలతోపాటు ఈసారి భారతదేశంలో కూడా ఘనంగా ఆ వేడుకలు జరిగాయి. ప్రధాని మోదీ, తెలం గాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సహా చాలామంది పాల్గొన్నారు. బుద్ధుని బోధనలు వర్తమానానికీ, భవిష్యత్‌కూ కూడా మార్గదర్శకాలేనని ప్రకటించారు. ఈ మాటలు అక్షరసత్యాలుగా నిలువబోతున్నాయనడానికి ఇటీవల జరుగుతున్న పరిణామాలే సాక్ష్యాలు. గౌతమ బుద్ధుడు పేర్కొన్నట్టు చెప్పే సంతోషానికి సంబంధించిన ఆ విషయాలను స్ఫూర్తిగా తీసుకొని మానవాభివృద్ధిని కొలిచే విధానాల్లో మార్పులు వచ్చాయి. దానికి పొరుగున ఉన్న భూటాన్ అగ్రభాగాన నిలిచింది. మొట్టమొదట ఆ అంశాన్ని ప్రతి పాదించినది ఆ దేశమే.
భూమికను ఇచ్చిన భూటాన్
ప్రజల అభివృద్ధిని ప్రస్తుతం జాతీయ తలసరి ఆదాయం ప్రాతిపదికగా నిర్ణ యిస్తున్నాం. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇతర అంశాలు కొన్నింటిని కొలమా నాలుగా చూస్తున్నాం. తలసరి జాతీయ ఆదాయం అనగానే అది ఎంత మాత్రం ప్రజలందరి అభివృద్ధిని ప్రతిబింబించేది కాదు. వంద రూపాయలు జాతీయ ఆదాయం అనుకుంటే, జనాభా వంద అనుకుంటే, అందులో 90 రూపాయలు ఒక వ్యక్తి ఆదాయం అయితే, మిగతా 99 మంది కేవలం పది రూపాయల ఆదాయాన్ని పంచుకోవాలి. ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ అభివృద్ధికి కొలమానం కాదని ఇప్పటికే చాలామంది ఆర్థిక శాస్త్రవేత్తలు మన జీడీపీ శాస్త్రీయతను తప్పుపట్టారు. ఈ క్రమంలోనే ప్రజల అభివృద్ధిని అం చనా వేయడంలో బౌద్ధ తాత్వికత పునాదిగా భూటాన్ ‘హ్యాపీనెస్ ఇండెక్స్’ (సంతోష సూచిక)ను ప్రతిపాదించింది. 1972లో అప్పటి భూటాన్ రాజు జిగ్మే సింఘే వాంగ్ చుక్ దీనిని రూపొందించారు. పశ్చిమ దేశాలు ప్రతిపాదిం చిన స్థూల జాతీయోత్పత్తి పేరుతో జరిగే భౌతికపరమైన అభివృద్ధికి బదు లుగా, బౌద్ధం విలువల పునాదిగా ఆర్థిక ప్రగతిని చూడాలనేది ‘హ్యాపీనెస్ ఇండెక్స్’ ఉద్దేశం. ఈ విషయాన్ని ప్రతిపాదిస్తూ, వాంగ్ చుక్ అన్న మాటలను గుర్తు చేసుకోవాలి. ‘నేను ప్రతిపాదిస్తున్న స్థూల జాతీయ సంతోష సూచిక (జీఎన్‌హెచ్)కు ఎవరేమైనా అర్థం చెప్పుకోవచ్చు. కానీ నా వరకు ఇది విలువ లతో కూడిన అభివృద్ధి. మానవత్వం, సమానత్వం, కరుణలతో కూడిన ప్రాథ మిక విలువలకూ, అవసరమైన ఆర్థిక ప్రగతికీ మధ్య వారధిని నిర్మించడమే దీని ప్రధాన ఉద్దేశం’ అని వాంగ్ చుక్ చేసిన వ్యాఖ్య బౌద్ధం మౌలిక చింతనకు అద్దం పడుతోంది.
ఈ విషయం చాలా మంది ఆర్థికవేత్తలను, రాజనీతి నిపుణులను, విధా న నిర్ణేతలను ఆలోచింపజేసింది. 2005వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్థూల జాతీయ సంతోష సూచిక ఆధారంగా మొదటిసారిగా సర్వే చేపట్టి, 2006 సంవత్సరంలో శ్వేతపత్రాన్ని ప్రచురిం చింది. అదే సంవత్సరం అమెరికా అనేక మంది నిపుణులను ఆహ్వానించి ఈ తాత్వికతపై చర్చించింది. 2007వ సంవత్సరంలో థాయిలాండ్ ‘గ్రీన్ అండ్ హ్యాపీనెస్ ఇండెక్స్’ను విడుదల చేసింది. 2009వ సంవత్సరంలో అమెరికా కూడా ‘వెల్ బీయింగ్ ఇండెక్స్’ పేరుతో సర్వే చేసింది.
భూటాన్ మళ్లీ దీనిమీద విస్తృత అధ్యయనం చేయడానికి కర్ముర నేతృ త్వంలో 2010 సంవత్సరంలో ఒక అధ్యయన సంస్థను నెలకొల్పింది. భూటా న్ అధ్యయన సంస్థగా పేర్కొనే ఈ సంస్థ కొన్ని సూచికలను రూపొందించిం ది. ఇందులో శారీరక, మానసిక, ఆధ్యాత్మికస్వస్థత, సమయపాలన, సామా జికవర్గాల శక్తి, సాంస్కృతిక బలం, విద్య, జీవనప్రమాణాలు, సుపరిపాలన, పర్యావరణ సమతుల్యత వంటి అంశాలు చోటుచేసుకున్నాయి. దీని తర్వాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం బహుముఖ పేదరిక సూచికలతో కూడిన నివేది కను రూపొందించింది. దీనినే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యు.ఎన్.డీ.పీ)కూడా అంగీకరించింది. అంతిమంగా, 2011లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ దీనిని అంగీకరిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అదే సంవత్సరం ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈసీడీ) మెరుగైన జీవన సూచిక (బెటర్ లైఫ్ ఇండెక్స్) పేరుతో ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది. అదే సంవత్సరం ఐక్యరాజ్య సమితి వరల్డ్ హ్యాపీనెస్ నివేదికను విడుదల చేసింది. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రతిసంవత్సరం నివేదికలు వస్తున్నాయి.
ఆ తర్వాత అనేక దేశాలు ఈ మార్గంలోనే వివిధ పేర్లతో అధ్యయనా లనూ, సర్వేలనూ నిర్వహించి ఒక నూతన విధానానికి శ్రీకారం చుట్టాయి. మన దేశంలో గోవా రాష్ట్రం 2012లో ఈ విధానం ప్రాతిపదికగా ఒక అధ్యయ నాన్ని నిర్వహించి ఒక నివేదికను ప్రచురించడం గమనార్హం. దక్షిణ కొరియా, సింగపూర్, బ్రెజిల్, మెక్సికో, ఫ్రాన్స్, బ్రిటన్, క్రొయేసియా లాంటి దేశాలు తమ తమ దేశాల్లో ఇటువంటి అధ్యయనాలను చేపడుతున్నాయి.
భూటాన్ ప్రత్యేకించి ఒక కమిషన్‌ను నియమించింది. భూటాన్ అధ్య యన సంస్థ కార్యక్రమాలకు ఇది అదనం. ఈ కమిషన్ ప్రజల అవసరాల ఆధారంగా ప్రాధాన్యతలను నిర్ణయిస్తుంది. నిధులను కేటాయిస్తుంది. అదే విధంగా లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఈ కార్యక్రమాలను సమన్వయం చేస్తూ, అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తుంది. మళ్లీ ఈ అనుభవాల ఆధారంగా విధానా లనూ, కార్యక్రమాలనూ తిరిగి రూపొందిస్తుంది. అంటే సమగ్ర మానవాభి వృద్ధికి భూటాన్ మార్గనిర్దేశనం చేసింది. ఈ రోజు ప్రపంచం దాని వెంట నడుస్తున్నది. జనాభా రీత్యా భూటాన్ చిన్నదేశమే కావచ్చు. కానీ ఆ ఆలోచ నకు ఉన్న శక్తి గొప్పది. ఈ ఆలోచనకు, ఆచరణకు పునాది బౌద్ధ తాత్వికశక్తి. రెండు వేల ఐదు వందల ఏళ్ల కిందట ప్రపంచాన్ని ప్రభావితం చేసిన బౌద్ధం మళ్లీ పరోక్షంగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నది. భూటాన్ ప్రభుత్వం స్వయంగా బౌద్ధం తమ విలువలకు పునాది అని ప్రకటించింది. అంటే ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థను బౌద్ధం ఆనాడే ప్రతిపాదించింది. ఇప్పటి వరకు ఏ దేశాలైతే ప్రపంచ ఆర్థికవ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకొని ఆధిప త్యం చలాయించాయో, అవి రోజు రోజుకు సంక్షోభం వైపు వెళుతున్నాయి. సమానత్వం, కరుణ, మానవత్వం మౌలిక విలువలను విడిచి దోపిడీ, పీడన, అహంకారం, వివక్ష, ద్వేషాలతో రగిలిపోయి యుద్ధాలను ప్రేరేపించి లక్షల కోట్ల ధనాన్ని ఆయుధాల మీద ఖర్చుపెట్టి, కోట్లాది మంది ప్రజల ప్రాణా లను బలితీసుకున్న వ్యవస్థలు భవిష్యత్‌లో తమ పునాదులను కాపాడుకో లేవు. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలు ఇస్లామిక్ దేశాల మీద, ప్రజల మీద కక్షగట్టి, అక్కడి వనరులను దోచుకుంటూ మారణహోమాన్ని సృష్టించి తమ వినాశనాన్ని తామే కొనితెచ్చుకుంటున్నాయి. ముస్లిం, క్రైస్తవాల పేరుతో ఈ యుద్ధాలు జరగకపోయినా, మిగతా ఆర్థిక, రాజకీయ కారణాలతోపాటు ఇది ప్రధానమైన అంశమనేది మరువకూడదు. అందుకే అమెరికా, యూరప్ దేశాలు పైకి గంభీరంగా కనిపించినా అంతర్గతంగా కృశించిపోయే స్థితికి వచ్చాయి.
బౌద్ధం వైపు అందరి చూపు
సరిగ్గా ఈ సమయంలోనే తూర్పు ఆసియా, దక్షిణాసియా దేశాలు నెమ్మదిగా నైనా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ దేశాలన్నింటిలో బౌద్ధం అనుసరిస్తున్న ప్రజలు మెజారిటీగా ఉన్నారు. శాంతి, ప్రశాంతతతో కూడిన మానవాభివృ ద్ధిని ఇప్పటికే భూటాన్ ప్రతిపాదించింది. చాలా దేశాలు ఆ మార్గంలో ఉన్నా యి. ఆర్థికంగా ఈ దేశాలు అభివృద్ధి చెందిన కొద్దీ బౌద్ధం శక్తి కూడా ప్రపం చవ్యాప్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది గుర్తించడం వల్లనే ఎక్కడైతే బౌద్ధం పురుడు పోసుకొని అడుగులేసిందో ఆ భారతదేశంలోని రాజకీయ నాయకత్వాలు కూడా బౌద్ధం శక్తిని, బౌద్ధాన్ని అనుసరిస్తున్న దేశాల స్నేహాన్ని కాంక్షిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జపాన్, చైనా లాంటి దేశా లతో స్నేహం పెంచుకోవడానికి బౌద్ధం పేరును వాడుకుంటున్నట్టు మనకు తెలుసు. అమరావతిని రాజధానిగా చేయడానికి కూడా చాలా కారణాలున్నా యి. అయితే తూర్పు, దక్షిణాసియాదేశాల దృష్టిలో పడడానికి అమరావతి పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగించుకున్నదని స్పష్టమౌతోంది. జపాన్ లాంటి బౌద్ధ మూలాలున్న దేశాల నుంచి ఆర్థిక సహాయానికి, ఇతర రకాల అవసరాలకు ఇది ఒక పరిచయ ద్వారమవుతుందనడంలో అనుమా నంలేదు. అయితే బౌద్ధాన్ని ఎవరెన్ని రకాలుగా ఉపయోగించుకున్నా, భారత దేశంలో వేళ్లూనుకున్న కులవ్యవస్థ నిర్మూలనకు కూడా ఆ తాత్విక భూమిక అవుతుందనడంలో సందేహం లేదు. దీనిని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఎప్పుడో గుర్తించారు. బౌద్ధాన్ని స్వీకరించి భవిష్యత్ దర్శనం చేశారు.
(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213