సరైన గురుదక్షిణ
బౌద్ధనీతి
జీవకుడు గొప్ప వైద్యుడు. మగధ రాజవైద్యుడు. బుద్ధుని అనుయాయి. బుద్ధునికి వ్యక్తిగత వైద్యుడు కూడా. రోగుల పొట్టకు, వెన్నెముకకు, తలకు శస్త్రచికిత్సలు చేసి, ‘కణుతులు’ తీసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. జీవకుడు ఎవరో చెత్తకుప్పలో కని పారేసిన బిడ్డ. మగధరాజు అభయుడు ఆ అనాధ బిడ్డను పెంచి, పెద్ద చేసి, విద్యార్జన కోసం తక్షశిలకు పంపుతాడు. అక్కడ ఏడేళ్లు వైద్యవిద్యను అభ్యసిస్తాడు.
జీవకుడు ఒకరోజు తన ఆచార్యుని దగ్గరకు పోయి, ‘‘ఆర్యా! నా చదువుకు ముగింపు ఎప్పుడు?’’ అని అడిగాడు.
‘‘జీవకా! ఇప్పుడే’’అన్నాడు ఆచార్యుడు.
‘‘ఆచార్యా! తమకు గురుదక్షిణగా ఏమివ్వగలను?’’ అని అడిగాడు.
‘‘జీవకా! తక్షశిలకు నాలుగు దిక్కులా వెదకు. ఎందుకూ పనికిరాని ఒక పిచ్చి మొక్కను తీసుకురా. అదే నీవు నాకిచ్చే దక్షిణ’’ అన్నాడు.
జీవకుడు వెళ్లి, వెదకి వెదకి చివరికి ఉత్త చేతులతో తిరిగొచ్చాడు.
‘‘ఆచార్యా! వైద్యానికి పనికి రాని మొక్క ఏదీ నాకు కనిపించలేదు’’అన్నాడు.
‘‘నాయనా జీవకా, ఇదే నీవు నాకు ఇచ్చిన సరైన గురుదక్షిణ. నేను పెట్టిన పరీక్షలో నెగ్గావు. నీ విద్యాభ్యాసం పూర్తయింది’’అని చెప్పి, దీవించి పంపాడు.
ఆ తర్వాత జీవకుడు గొప్ప వైద్యునిగా, బౌద్ధునిగా రాణించాడు.
- బొర్రా గోవర్ధన్