రూ.1,999 లకే స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: ఫీచర్ ఫోన్ల జీవీ మొబైల్స్ కంపెనీ తన తొలి స్మార్ట్‌ఫోన్ ను అత్యంత చౌకగా గురువారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. జేఎస్పీ20 పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.1,999 అని మొబైల్స్ కంపెనీ సీఈఓ పంకజ్ ఆనంద్ చెప్పారు. భారత్‌లో అత్యంత చౌకగా లభ్యమయ్యే ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ ఇదేనని పేర్కొన్నారు. ఈ డ్యుయల్ సిమ్ ఫోన్లో 3.5 అంగుళాల స్ర్కీన్, 1 గిగా హెర్ట్స్ ప్రాసెసర్, 128 ఎంబీ ర్యామ్, 256 ఎంబీ మెమొరి, 32జీబీ ఎక్స్‌పాండబుల్ మెమొరి, 2 మెగా పిక్సెల్ కెమెరా, 1350 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు.
ఈ ఫోన్ ను అమెజాన్ డాట్ ఇన్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఇంటర్నెట్ అందుబాటులో లేని వారి కోసం కాలేజీలు, ఇతర ప్రాంతాల్లో తమ ప్రతినిధులు ఈ ఫోన్ కొనుగోలులో సాయం చేస్తారని వివరించారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌పై పనిచేసే మరికొన్ని కొత్త డివైస్‌లను రానున్న వారాల్లో అందించనున్నామని తెలిపారు.