జూనియర్ డాలాకు పిలుపు
ఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్లో వరుస పరాజయాలతో సతమవుతున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు నుంచి సఫారీ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ వైదొలిగిన సంగతి తెలిసిందే. వెన్నునొప్పితో బాధపడుతున్న మోరిస్ టోర్నీ నుంచి అర్దాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. అయితే అతని స్థానాన్ని దక్షిణాఫ్రికాకే చెందిన పేసర్ జూనియర్ డాలాతో భర్తీ చేసేందుకు ఢిల్లీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఢిల్లీ డేర్‌డెవిల్స్ మేనేజ్మెంట్ నుంచి జూనియర్ డాలాకు పిలుపు అందింది. కాగా, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుతో డాలా కలిసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
గతేడాది భారత్‌తో జరిగిన టీ 20 సిరీస్ ద్వారా దక్షిణాఫ్రికా తరపున అరంగేట్రం చేసిన డాలా.. ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడి ఆకట్టుకున్నాడు. భారత్‌తో సిరీస్‌లో డాలా ఏడు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. అతని అత్యుత్తమ ప్రదర్శన 3/35గా ఉంది.