సీజేఐతో హైకోర్టు ఏసీజే భేటీ
న్యాయాధికారుల కేటాయింపు, హైకోర్టు విభజనపై చర్చ
సాక్షి, న్యూఢిల్లీ:
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ దిలీప్ బి బొసాలే శనివారమిక్కడ ఆయన నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య న్యాయాధికారుల కేటాయింపు వ్యవహారం, హైకోర్టు విభజన తదితర అంశాలపై వీరిరువురూ చర్చించినట్టు సమాచారం. తెలంగాణ న్యాయాధికారులు, కింది కోర్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని, లేకుంటే ఉభయ రాష్ట్రాల్లో కక్షిదారులకు న్యాయాన్ని అందించేందుకు ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలించాల్సి ఉంటుందని హైకోర్టు ప్రకటన జారీ చేసిన మరుసటి రోజే ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
న్యాయాధికారుల కేటాయింపు, హైకోర్టు విభజనకు మౌలిక వసతుల కల్పన తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. అనంతరం జస్టిస్ దిలీప్ బి బొసాలే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కెహార్, జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ అశోక్భూషణ్ను వేర్వేరుగా కలిశారు. ఆదివారం ఉదయం తెలంగాణ న్యాయవాదులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలవనున్నట్టు సమాచారం.