ఆర్బీఐ డిప్యూటీ రేసులో పీఎన్బీ కామత్ ముందంజ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ రేసులో పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) సీఎండీ కె.ఆర్. కామత్ ముందు వరుసలో ఉన్నారు. కె.సి. చక్రవర్తి రాజీనామా కారణంగా ఖాళీ అయిన డిప్యూటీ గవర్నర్ పదవిని భర్తీ చేయడానికి గత శనివారం ఇంటర్వ్యూలు జరిగాయి. ఆర్బీఐ గవర్నర్ రంగరాజన్ అధ్యక్షుడిగా, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ టక్రు, ఇతర నిపుణులు సభ్యులుగా గల సెర్చ్ ప్యానెల్ ఈ ఇంటర్వ్యూలను నిర్వహించింది.
ఏడాదికి మించిన కాలం బ్యాంక్ సీఎండీలుగా పనిచేస్తున్న వారిని ఇంటర్వ్యూకి పిలిచారు. మొత్తం 9 మంది ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఎండీలను ఇంటర్వ్యూకు పిలిచామని సంబంధిత ఉన్నతాధికారొకరు చెప్పారు. వారిలో పీఎన్బీ సీఎండీ కె.వి. కామత్‌కు అందరి కంటే అధిక కాలం(ఆరేళ్లు) సీఎండీగా చేసిన అనుభవం ఉందని, ఆయనకే అవకాశాలు అధికంగా ఉన్నాయని వివరించారు. ప్రధాని అధ్యక్షతన గల అప్పాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్(ఏసీసీ) తుది నిర్ణయం తీసుకుంటుంది. ఆర్బీఐకు నలుగురు డిప్యూటీ గవర్నర్లుంటారు. ఇద్దరు ఆర్బీఐ నుంచి, ఒకరు ప్రభుత్వ రంగ బ్యాం కుల నుంచి ఉండగా, ఆర్థికవేత్తను మరో డిప్యూటీ గవర్నర్‌గా కేంద్రం నియమిస్తుంది. కాగా ప్రస్తుతం 2 డిప్యూటీ గవర్నర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.