లినెన్ పై రామ్ రాజ్ కాటన్ దృష్టి
రూ. 25 కోట్లతో బెంగళూరులో లినెన్ షర్ట్ యూనిట్ ఏర్పాటు
♦ ఈ ఏడాది ఉత్తరాది మార్కెట్లోకి అడుగు
♦ డిసెంబర్ నాటికి 100 ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్
♦ రామ్రాజ్ కాటన్ చైర్మన్ కె.ఆర్.నాగరాజన్ వెల్లడి...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లినెన్ దుస్తులపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు రామ్రాజ్ కాటన్ ప్రకటించింది. రోజుకు 5,000 చొక్కాలను తయారు చేసే సామర్థ్యంతో కూడిన లినెన్ యూనిట్‌ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నట్లు రామ్రాజ్ కాటన్ చైర్మన్ కె.ఆర్.నాగరాజన్ తెలిపారు. సుమారు రూ. 25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ దసరా నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి రామ్రాజ్ కాటన్ సొంత షోరూంను టాలీవుడ్ నటుడు దగ్గుబాటి వెంకటేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాగరాజన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ బెంగళూరు యూనిట్ ద్వారా 2,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. బెల్జియం నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ రెడిమేడ్ దుస్తులను తయారు చేస్తామన్నారు. ఇప్పటికే తిరువూరు, మదురై, ఈరోడ్ల్లో తయారీ యూనిట్లు ఉన్నాయని, నాల్గవది బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తరించిన తాము ఇప్పుడు ఉత్తరాది మార్కెట్‌పై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఉత్తరాది రాష్ట్రాల్లోని మెట్రో పాలిటన్ నగరాల్లో షోరూంలను ఏర్పాటు చేయనున్నామని, అక్కడి వస్త్రధారణకు అనుగుణంగా కుర్తా పైజామాలను విక్రయించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
గతంలో రామ్రాజ్ కాటన్ అనగానే పంచెలు గుర్తుకు వచ్చేవని, ఇప్పుడు తెల్లటి దుస్తులు గుర్తుకు వస్తున్నాయని, ఇక నుంచి సంప్రదాయ దుస్తులకు వేదికగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రామ్ రాజ్ కాటన్‌కి దేశవ్యాప్తంగా 60 సొంత షోరూంలు ఉండగా ఈ సంఖ్యను డిసెంబర్ నాటికి 100కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇవి కాకుండా దేశవ్యాప్తంగా 600 మందికిపైగా డీలర్లు ఉన్నారని, వీటితో పాటు రిటైల్ బట్టల దుకాణాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసే విధంగా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్ఎస్ బ్రదర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని, త్వరలోనే మరిన్ని రిటైల్ సంస్థలతో ఇటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. వెంకటేష్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకున్న తర్వాత తెలుగు రాష్ట్రాల పంచెల అమ్మకాల్లో అయిదు రెట్ల వృద్ధి కనిపించిందన్నారు. వ్యాపారంలో ఏటా 30 శాతం వృద్ధి నమోదు చేయడం ద్వారా రూ. 1,000 కోట్ల మార్కును అధిగమించినట్లు తెలిపారు. ప్రస్తుతం తమ సంస్థ ద్వారా 10,000 మందికిపైగా చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నట్లు నాగరాజన్ తెలిపారు.