‘శ్రీశైలం రిజర్వాయర్లో 854 అడుగుల నీటిమట్టం ఉంచాలి’
నాలుగేళ్లుగా కరువుతో అల్లాడుతున్న రాయలసీమ ప్రజలను అదుకునేలా శ్రీశైలం రిజర్వాయర్లో నీటిమట్టాన్ని 854 అడుగులు ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శుక్రవారం లేఖ రాశారు. నాలుగేళ్లుగా వర్షాలు లేక ప్రాజెక్టుల్లో నీరు చేరలేదని, దీని వల్ల ఆయకట్టు ప్రాంతాలు బీడుగా మిగిలిపోయాయని వివరించారు.
ఈ ఏడాది మహారాష్ట్ర, కర్నాటకలో కురిసిన వర్షాలకు అల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లు నిండాయన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతున్నందున రాయలసీమకు మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు కేసీ కెనాల్ అయకట్టుకు నీరివ్వలేదని గుర్తు చేశారు. రాయలసీమ ప్రాజెక్టులైన తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల ద్వారా కరువు జిల్లాలకు నీరందించాల్సి ఉందని కోరారు.