కబాలి దర్శకుడితో సూర్య
కబాలి చిత్ర దర్శకుడి దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు సూర్య. ఆ మధ్య కథలను ఎంచుకోవడంలో కాస్త తడబడ్డ సూర్య అపజయాలతో పెద్ద మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చింది. అంజాన్, మాస్ లాంటి చిత్రాలు ఆయన్ని నిరాశపరిచిన మాట వాస్తవం. అయితే అపజయాలు పెద్ద పాఠం అంటారు. అంతే కాదు విజయానికి నాంది అని కూడా అంటారు. సూర్య విషయంలో ఈ రెండూ జరిగాయి. ఫలితం 24 వంటి ఘన విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తూ విదేశాల్లో విహరిస్తున్న సూర్య తాజా చిత్రానికి దర్శకుడిని ఎంచుకున్నారు.
అట్టకత్తి, మెడ్రాస్ చిత్రాల దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ దర్శకుడు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కబాలి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కబాలి చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్ర ఆడియో జూన్ తొలి వారంలోనూ, చిత్రం జూలై ఒకటవ తేదీన విడుదలకు సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తదుపరి రంజిత్ సూర్య హీరోగా చిత్రం చేయనున్నట్లు తెలిసింది.
ఈ భారీ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్‌రాజా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. విదేశాల నుంచి తిరిగి రాగానే ప్రస్తుతం నటిస్తున్న సింగం-3 చిత్రాన్ని పూర్తి చేయనున్నారు. ఆ తరువాత రంజిత్ దర్శకత్వంలో నటించనున్నట్లు తెలిసింది. టాలీవుడ్ సక్సెస్‌పుల్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనూ సూర్య ఒక ద్విభాషా చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు ప్రచారం జరుగుతుండడం గమనార్హం. అయితే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు.అయితే తెలుగులో ఒక డెరైక్ట్ చిత్రం చేయాలన్న కోరిక సూర్యకు చాలా కాలంగా ఉంది. అదిప్పుడు నెరవేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.