సమోసా, కచోరీలపై భారీ పన్ను!
పాట్నా: కప్పు చాయ్, ఒక సమోసా తింటే కడుపు నిండిన సంతృప్తి సామాన్యుడికి. కానీ రానురాను ఖరీదైన ఆహార పదార్థాల జాబితాలో చేరిపోయి.. అవి కూడా సామాన్యుడికి అందని ద్రాక్షల్లా మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా బిహార్‌లోని నితీశ్‌కుమార్ ప్రభుత్వం సమోసా, కచోరీలను విలాస వస్తువుల జాబితాలో చేర్చి.. వాటిపై ఏకంగా 13.5శాతం పన్ను విధించింది. అభివృద్ధి అజెండాతో ముందుకుసాగుతున్న నితీశ్ సర్కార్ అందుకు తగిన నిధులను పన్నులరూపంలో సమకూర్చుకోవాలని తాజాగా నిర్ణయించింది. ఇందులో భాగంగా విలాస వస్తువులపై 13.5 శాతం పన్ను విధించాలని నిర్ణయించింది. కిలోకు రూ. 500 కన్నా అధికంగా ధర కలిగిన మిఠాయిలు, దోమల్ని నిరోధించే మస్కిటో కాయిల్స్ వంటివాటిని ఈ విలాస వస్తువుల జాబితాలో చేర్చింది. సీఎం నితీశ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మిఠాయిలతోపాటు సాల్టీ ఆహార పదార్థాలైన సమోసా, కచోరీలపైనా 13.5 శాతం పన్ను విధిస్తున్నామని కేబినెట్ కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ బ్రజేశ్ మెహోత్రా తెలిపారు. అదేవిధంగా అన్ని రకాల యూపీఎస్ వస్తువులపైనా ఈ విలాస పన్ను ఉంటుందని, ఇసుక, సౌందర్య సాధన ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, తలనూనె వంటివాటిపై కూడా 13.5శాతం పన్ను విధించనున్నామని ఆయన చెప్పారు.