ఎమ్మెల్యే అంటే అలుసా?
ఎల్.ఎన్.పేట: ఉద్యోగులు రాజకీయాలు చేయడమేమిటి?.. నియోజకవర్గ స్థాయిలో జరిగే సమీక్ష సమావేశానికి స్థానిక ఎమ్మెల్యేను పిలవాలని తెలియదా??.. అంటూ పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. ఎల్.ఎన్.పేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాతపట్నంలో శనివారం ఆర్డీవో సాల్మన్రాజ్ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారని అన్నారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహననాయుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన వ్యక్తి శత్రుచర్ల విజయరామరాజులతోపాటు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన టీడీపీ కార్యకర్తలను పిలిచి మండలాల వారీగా సమీక్షలు నిర్వహించారని అన్నారు.
నియోజకవర్గ ప్రజాప్రతినిధి అయిన స్థానిక ఎమ్మెల్యేను పిలవాలని అధికారులకు తెలియదా? అని ప్రశ్నించారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై స్పీకరుకు ఫిర్యాదు చేస్తామని, అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తామని చెప్పారు. రాజ్యంగం ప్రకారం ప్రజాప్రతినిదులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. ఇది ఎమ్మెల్యేను అగౌరవపరచడమేనని ధ్వజమెత్తారు. మంత్రి, ఎంపీలు నియోజకవర్గం అభివృద్ధికి పాటు పడతామంటే సహకరిస్తామని, అయితే ఇలాంటి కుసంస్కృతిని ప్రోత్సహించడం తగదన్నారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు కొమరాపు తిరుపతిరావు, కె.చిరంజీవి, ఎర్ర జనార్ధనరావు, యారబాటి రామకృష్ణ, కిలారి త్రినాధరావు, రెడ్డి లక్ష్మణరావు, ఎస్.కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశం మేం నిర్వహించలేదు:ఆర్డీవో
దీనిపై పాలకొండ ఆర్డీవో సాల్మన్రాజ్ మాట్లాడుతూ అధికారికంగా నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించలేదన్నారు. శనివారం మంత్రి, ఎంపీలు పాతపట్నంలోని కొన్ని గ్రామాల్లో పర్యటించారని అందులో పాల్గొనేందుకు వెళ్లామన్నారు. పర్యటన తరువాత అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నాం రమ్మంటే తామంతా వెళ్లామన్నారు. అధికారులు నిర్వహించే సమావేశమైతే తప్పకుండా ప్రొటోకాల్ పాటిస్తామన్నారు. ఎమ్మెల్యేగారు సమావేశం ఏర్పాటు చేసి పిలిస్తే.. మేమంతా హాజరవుతామన్నారు.