పర్యావరణాన్ని పరిరక్షించాలి
మొక్కల పెంపకం అందరి బాధ్యత
రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసురంగారావు
జనగామ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసురంగారావు అన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రజలందరూ విధిగా మొక్కలను పెంచాలని సూచించారు. రూరల్ పోలీసు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఎస్పీ కాళిదాసురంగారావు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తన జీవితంలో మొత్తం లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. ఇందులో భాగంగా 1978లో తాను డిగ్రీ చదివిన రోజుల్లో ఎన్ఎస్ఎస్ విద్యార్థిగా వేలాది మొక్కలు నాటానని గుర్తుచేశారు.
వంట చెరుకు కారణంగా ప్రస్తుతం అడవులు క్షీణిస్తున్నాయని, వాటి లోటును పూడ్చేందుకు ప్రతి ఒక్కరూ విధిగా 100 మొక్కలు నాటాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులందరూ ప్రతిభావంతులని, ప్రస్తుతం ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ప్రజాప్రతినిధులు చాలామంది అందులో చదువుకున్నావారేనని తెలిపారు.
తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు విద్యార్థులు కృషి చేయాలని కోరారు. మునిసిపల్ చైర్మన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి మాట్లాడుతూ జూనియర్ కళాశాలలో మూత్రశాలల నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని హామీఇచ్చారు. కళాశాలలో విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచేందుకు అధ్యాపకులు పాటుపడాలని కోరారు. అనంతరం మునిసిపల్ వైస్‌చైర్మన్ నాగారపు వెంకట్, డీఎస్పీ కూర సురేందర్, కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ నాగబండి సుదర్శనం, క ళాశాల అధ్యాపకులు ఐదు కంప్యూటర్లను విద్యార్థులకు అందించనున్నట్లు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీ సురేందర్, సీఐ నర్సింగరావు, ఎస్సై కోటేశ్వర్రావు, కౌన్సిలర్ కన్నారపు ఉపేందర్, నాయకులు పిట్టల సత్యం, లెక్చరర్లు ఎండీ.అప్జల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన రూరల్ ఎస్పీ
జనగామరూరల్ : పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ను బుధవా రం రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసురంగారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం పోలీస్‌పరేడ్ విషయమై సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఐ నర్సింహారావు, ఎస్సై కోటేశ్వర్రావు ఉన్నారు.