కందికుంట ప్రోత్సాహంతోనే నాపై కేసు
– ఇంట్లోనే కుటుంబ సమేతంగా ఆమరణ దీక్షకు దిగుతాం..
–ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దేవానంద్
కదిరి : కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ తనపై తప్పుడు కేసు పెట్టించారని, తనకు, కుటుంబానికి ఏదైనా జరిగితే ఆయనే కారణమని అదే పార్టీకి చెందిన ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గుడిసె దేవానంద్ ఆరోపించారు. గురువారం ఆయన కదిరిలోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. నల్లచెరువు మండలం సంజీవపల్లిలో దళితులకు, కమ్మ సామాజిక వర్గీయులకు దారి విషయంలో మూడేళ్లుగా గొడవ జరుగుతోందన్నారు. తాను గతంలో ఇరువర్గాల కోరిక మేరకు పెద్ద మనిషిగా వెళ్లానన్నారు. అప్పుడు వాహనాల అద్దె కోసమని అక్కడున్న పెద్ద మనుషులు తన చేతికి రూ.50 వేలు ఇచ్చారని, ఆ డబ్బు ఆరోజే అద్దె వాహనాల నిర్వాహకులకు ఇచ్చేశానని తెలిపారు.
ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట ప్రసాద్ వ్యవహార శైలి నచ్చక ఎమ్మెల్యే చాంద్‌బాషాకు దగ్గరయ్యానన్నారు. దీన్ని జీర్ణించుకోలేక కందికుంట తనపై కక్ష గట్టారని ఆరోపించారు. ఈ నెల ఎనిమిదిన ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం సందర్భంగా స్వామివారి అ„ìక్షింతలు తీసుకుందామని వేదిక మీదకు వెళ్తుంటే కందికుంట తన చొక్కా పట్టుకొని కులం పేరుతో దూషించి అవమాన పరిచారన్నారు. కదిరి డీఎస్పీ వెంకట రామాంజనేయులు ఎదుటే తనకు అవమానం జరిగిందన్నారు. డీఎస్పీ సైతం కందికుంటకు మద్దతుగానే మాట్లాడారన్నారు.
దళితుడైనందుకే తనను కందికుంట అవమానిస్తున్నారని, ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లానని తెలిపారు. ఇదంతా మనసులో పెట్టుకొని రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్నారన్నారు. అందుకే తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని, తనకు, కుటుంబానికి ఏదైనా జరిగితే కందికుంటతో పాటు డీఎస్పీ రామాంజనేయులు బాధ్యులని స్పష్టం చేశారు. న్యాయం జరగకపోతే వచ్చే నెల 14న ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి ఆమరణ దీక్ష చేపడతామని హెచ్చరించారు.