దీని దుంపతెగా
రాజవొమ్మంగి : సాధారణంగా ఒకటి, రెండు కిలోల బరువు మాత్రమే తూగే కర్రపెండలం దుంప ఏకంగా తొమ్మిది కిలోల బరువుతో చూపరులను అబ్బురపరుస్తోంది. రాజవొమ్మంగిలోని మైలబోయిన సత్యనారాయణ, శిరీష దంపతులు తమ ఇంటి పెరటిలో గతేడాది నాటిన దేశవాళీ కర్రపెండలం చెట్టు నుంచి వారు ఒకటి, రెండు సార్లు దుంపలు తవ్వి తిన్నారు. అదేమాదిరి బుధవారం కూడా తవ్వుతుండగా ఓ భారీ దుంప బయటపడింది. దాదాపు మీటరున్నర పొడవుతో లావుగా ఉన్న ఆ దుంపను చూసి స్థానికులు ఆవాక్కయ్యారు. అదే ఇంటి ప్రాంగణంలో అద్దెకు ఉంటున్న వ్యవసాయ విస్తరణాధికారి కత్తులు సోమిరెడ్డి మాట్లాడుతూ నేల స్వభావం, చెట్టుకు అందిన తేమ వల్ల ఈ దుంప భారీగా పెరిగి ఉండవచ్చన్నారు. ఇలా పెరగడం చాలా అరుదని ఆయనన్నారు.