Kariff crop
-
కోటి ఆశలతో
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలకరి పలకరింపుతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. సమృద్ధిగా పంటలు పండాలని ఆకాంక్షిస్తూ సాగుకు ఉపక్రమిస్తున్నారు. ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు ఇప్పుడిప్పుడే దుక్కులు సిద్ధం చేసుకుంటున్న దృశ్యాలు జిల్లాలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యవసాయశాఖ ఖరీఫ్ ప్రణాళికను సిద్ధం చేసింది. ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగయ్యే అవకాశముందో అంచనా వేసిన ఆ శాఖ అధికారులు.. దీనికి అనుగుణంగా ఆయా పంటల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచింది. గతేడాది తరహాలోనే ఈ సీజన్లోనూ 1.68 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు కావొచ్చని అధికారులు అంచనా వేశారు. ఇందుకుగాను వాణిజ్య పంటైన పత్తి మినహా ఇతర పంటల విత్తనాలు సుమారు 26 వేల క్వింటాళ్లు అవసరమవుతాయని లెక్కగట్టారు. సబ్సిడీపై విత్తనాలు సిద్ధం పత్తి మినహా ఇతర పంటల విత్తనాలు రైతులకు సబ్సిడీ లభిస్తున్నాయి. పంటను బట్టి విత్తనాలపై సబ్సిడీ ధరలో మార్పులు ఉంటాయి. సోయాబీన్ క్వింటా ధర రూ.6,150 కాగా.. సబ్సిడీపై రూ.2,500 లకే రైతులకు అందజేశారు. అలాగే క్వింటా జీలుగ ధర రూ.5,150, రాయితీపై రూ.3,350కు విక్రయిస్తారు. జొన్న, కొర్రలు, సజ్జలు, అండ్రు కొర్రలు తదితర చిరుధాన్యాలపై 65 శాతం, వేరుశనగ, నువ్వులు, ఆముదంపై 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. సబ్సిడీ విత్తనాలు అధికారుల వద్దకు చేరుకున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్), రైతు సేవా కేంద్రాలు (ఏఆర్ఎస్కే), జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ (డీసీఎంఎస్) తదితర కేంద్రాల నుంచి రైతులు విత్తనాలు తీసుకోవచ్చు. రైతు ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ పత్రాలను సమీప ఏఈఓను సంప్రదించి సబ్సిడీపై విత్తనాలు పొందవచ్చు. ఏఈఓలు ఆన్లైన్లో జనరేట్ చేసిన టోకెన్‌ను రైతులు అందిస్తే సమీపంలోని పీఏసీఎస్, డీసీఎంఎస్, ఏఆర్ఎస్కే కేంద్రాల్లో ఇచ్చి విత్తనాలు కొనుగోలు చేయవచ్చు. పత్తి విత్తనాల ధర ఇలా.. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న డీలర్లు మాత్రమే విత్తనాలు విక్రయించాలి. ఇతరులు అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేస్తే అది నేరమే. ఈ విషయంలో జిల్లా వ్యవసాయ అధికారులు పకడ్బందీగా వ్యహరిస్తున్నారు. అంతేగాక ఎమ్మార్పీకి మించి విక్రయించకూడదు. వ్యవసాయ శాఖ పత్తి విత్తనాల ధరను నిర్ణయించింది. 450 గ్రాముల తూకం కలిగిన బీజీ–1 విత్తనాలను రూ.635, బీజీ–2 విత్తనాలను రూ.730కు మాత్రమే రైతులకు అమ్మాలి. 15 రోజుల్లో ఎరువులు ఈ సీజన్లో సాగయ్యే పంటలకు సుమారు 1.03 లక్షల టన్నుల వివిధ రకాల రసాయనిక ఎరువులు అవసరం. రైతులు అత్యధికంగా యూరియా వినియోగిస్తున్నారు. వీటిని ఇప్పటికే రైతలకు అందుబాటులో ఉంచారు. -
ఖరీఫ్ ‘పెట్టుబడి’
నల్లగొండ అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం నగదు రైతుల ఖాతాల్లో జమవుతోంది. ఖరీఫ్‌లో రైతులకు పెట్టుబడి కోసం ఉపయోగపడే విధంగా ఈ నెల మొదటి వారంనుంచి రైతుల ఖాతాల్లో నగదును జమచేయడాన్ని వ్యవసాయశాఖ ప్రారంభించింది. మృగశిర కార్తె ప్రారంభం కావడం జిల్లాలో రెండు రోజుల క్రితం వర్షం కురవడంతో రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే రైతులు దుక్కులు దున్నడం, విత్తనాలు, ఎరువులు కొనుగోలు ప్రారంభించారు. సీజన్ మొదట్లోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమచేయడంతో.. రైతులకు సకాలంలో పెట్టుబడి కోసం ఉపయోగపడే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 4,14,272 మంది రైతులకు గాను రూ.579,96,32,660లను రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.5 వేల చొప్పున జమచేయాల్సి ఉంది. అయితే ట్రెజరీ ద్వారా ఇప్పటి వరకు జిల్లాలోని 19,795 మంది రైతులకు ఎకరాకు రూ.5వేల చొప్పున రూ.17,73,81,865 బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. మిగిలిన రైతులకు వరుస క్రమంలో ఖాతాల్లో జమకానున్నాయి. ఈ ప్రక్రియ ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏఈఓలకు ఖాతా నంబర్లు అందజేయాలి.. పట్టాదార్ పాస్ పుస్తకాల్లో దొర్లిన తప్పొప్పులు సవరణలు చేసిన తరువాత తహసీల్దార్ డిజిటల్ సంతకంతో కూడిన పాస్బుక్కలు వచ్చిన వారు జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల మంది వరకు ఉన్నారు. వారికి గత ఖరీఫ్, రబీలో రైతుబంధు నగదు ఖాతాల్లో జమకాలేదు. వారందరి నుంచి పాస్‌పుస్తకాల జిరాక్స్‌లను, రైతు ఖాతా నెంబర్లను సేకరించాలని వ్యవసాయ శాఖను అదేశించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల నుంచి పాస్‌పుస్తకాల జిరాక్స్‌లు, ఖాతా నంబర్లను సేకరించే పనిలో ఉన్నారు. రైతులందరూ విధిగా వ్యవపాయ విస్తరణాధికారులకు జిరాక్స్‌లను అందజేయాలని కోరుతున్నారు. భూములు కొనుగోలు చేసిన వారు.. ఇతరుల నుంచి భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుని తహసీల్దార్ నుంచి పాస్ పుస్తకం తీసుకున్న వారు కూడా రెవన్యూ శాఖ.. తమ పేరు వ్యవసాయ శాఖకు పంపిన జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలి. ఆ జాబితా కోసం వ్యవసాయ విస్తరణాధికారులను సంప్రదించాల్సి ఉంది. వారి పేరు జాబితాలో ఉంటే వారు కూడా పాస్‌పుస్తకం, ఖాతా నెంబర్ జిరాక్స్‌లను అందజేస్తే ఖరీఫ్‌లో రైతుబంధు నగదు జమచేసే అవకాశం ఉంటుంది. దశల వారీగా రైతుల ఖాతాల్లో జమ.. ఖరీఫ్‌లో రైతుబంధు పంపిణీ ఇప్పటికే ప్రారంభమై సుమారు రూ.17 కోట్ల వరకు రైతుల ఖాతాల్లో నగదు జమ చేశాం. రైతులందరికీ తప్పకుండా దశల వారీగా ఖాతాల్లో జమచేస్తారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రైతులు దుక్కులు దున్నకం, విత్తనాల కొనుగోలును ప్రారంభించారు. రైతుబంధు పథకం పెట్టుబడికి ఎంతో ఉపయోగపడనుంది. రైతులు అవకాశాన్ని సద్వినియోగ చేసుకుని సకాలంలో పంటల సాగును చేపట్టాలి. – జి.శ్రీధర్‌రెడ్డి, జేడీఏ -
సాగును తీరం చేర్చిన ‘కృష్ణా'!
* 2014-15లో సాగర్, ఎస్ఎల్బీసీ కింద లక్ష్యం మేరకు ఆయకట్టుకు నీరు * ఖరీఫ్‌లో 5.3 లక్షలు, రబీలో 3.50 లక్షల ఎకరాలకు జలసిరి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కృష్ణా నది పరీవాహకం కింది ఆయకట్టుకు ఈ ఏడాది (2014-15) పూర్తిస్థాయిలో సాగునీరు అందింది. గతంలో ఖరీఫ్ పంటలకు చాలీచాలని నీరు... రబీలో క్రాప్ హాలిడేలు ఎక్కువగా ఉండే నాగార్జునసాగర్ కింది ఆయకట్టుకు ఆశించిన స్థాయిలో సాగునీరు అందించడంలో ప్రభుత్వం సఫలమైంది. ఏపీతో ఉన్న వివాదాలను పరిష్కరించుకొని లభ్యత జలాలను సమర్థంగా వాడుకోవడం, నీటి నిర్వహణను ప్రభావవంతంగా చేయడంతో తక్కువ నీటితోనే ఎక్కువ ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. తక్కువ నీరు..ఎక్కువ ఆయకట్టు: కృష్ణాలో మొత్తంగా ఈ ఏడాది 585 టీఎంసీల మేర లభ్యత జలాలు ఉండగా అందులో 38 శాతం వాటా లెక్కన తెలంగాణకు 216 టీఎంసీలు దక్కాయి. అందులో సాగర్ కింద నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని 6 లక్షల ఎకరాలకుగానూ ఖరీఫ్‌లో 104 టీఎంసీలతో 5.22 లక్షల ఎకరాలకు, ఆరుతడి పంటలు ఎక్కువగా సాగుచేసే రబీలో 35 టీఎంసీలతో 3.50 లక్షల ఎకరాలకు సాగునీరందించారు. ఎస్ఎల్బీసీ కింద 2.22లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యానికి గానూ 13.5 టీఎంసీలతో 1.7 లక్షల ఎకరాలకు నీరిచ్చారు. అదే 2013-14లో సాగర్ ఎడమ కాల్వ కింద ఏపీలోని నూజివీడు, మైలవరం ఆయకట్టును కలుపుకొని ఖరీఫ్‌లో 165 టీఎంసీలతో 6.9 లక్షలు, రబీలో 63 టీఎంసీలతో 4.3 లక్షల ఎకరాలకు నీరిచ్చారు. జోన్-3 కిందకు వచ్చే ఆంధ్రా ప్రాంతంలోని ఆయకట్టే సుమారు 3 లక్షల వరకు ఉంటుంది. ఆ ఆయకట్టును తీసేస్తే తెలంగాణ ఆయకట్టు ఖరీఫ్‌లో 4.5 లక్ష లు, రబీలో 2.5 లక్షలు మించలేదు. ఇక 2012-13లోనైతే నీటి కొరత కారణంగా ఎడమ కాల్వ కింద జోన్-3ని కలుపుకొని మొత్తంగా 9 లక్షల ఎకరాల్లో కేవలం 2.5 లక్షల ఎకరాలు, రబీలో కేవలం 60 వేల ఎకరాలకే నీరిచ్చారు. 2012-13, 2013-14లతో పోలిస్తే ప్రస్తుత ఏడాది సాగర్ కింద సాగైన ఆయకట్టు చాలా ఎక్కువని నీటిపారుదల వర్గాలు వెల్లడించాయి. నీటి వాడకంపై నిరంతర పర్యవేక్షణ వల్లే ఆయకట్టు లక్ష్యాలు సాధ్యమయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగ ర్ కుడికాల్వ కింద గుంటూరు కింద 6.69 లక్షలు, ప్రకాశం కింద 4.49 లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకే ఎక్కువ చొరవ చూపేవారని, దీంతో ఎడమ కాల్వకింద ఆయకట్టుకు నీరందేది కాదని, కానీ ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దొరికిందని వారంటున్నారు. కొత్తగా 1.6 లక్షల ఎకరాలు.. కృష్ణా జలాలపై ఆధారపడిన మహబూబ్‌నగర్ జిల్లాలోని 3 ప్రాజెక్టుల కింద కొత్త ఆయకట్టుకు నీరందించే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. జూన్ చివరికల్లా నెట్టెంపాడు (22 టీఎంసీలు), కల్వకుర్తి (25టీఎంసీలు), భీమా (20టీఎంసీలు) ప్రాజెక్టు పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి లక్ష్యం మేరకు 1.66 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని భావిసు ్తన్నారు. ప్రాజెక్టుల కింద పూర్తి సాగు లక్ష్యం 7.40 లక్షల ఎకరాలు ఉండగా ఇందులో ఇప్పటికే 30 వేల ఎకరాలకు నీరందిస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో అందే ఆయకట్టును కలుపుకుంటే మొత్తంగా అది 2 లక్షలకు చేరుతుంది. మిగతా లక్ష్యాన్ని 2016 జూన్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.