ఇంకెవరూ దొరకలేదా అంటూ మాజీ లవర్ను!
ఓహియో: తన మాజీ ఫ్రెండ్ ఓ నల్లజాతి యువతితో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో శ్వేతజాతి యువతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నల్లజాతి యువతిపై జాతి విద్వేష వ్యాఖ్యలు చేస్తూ.. ఆ తతంగాన్ని తన మొబైల్లో రికార్డ్ చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఆ వివరాలిలా... ఓహియో స్టేట్ వర్సిటీకి చెందిన యువతి కేటలిన్ రస్ట్ ఇటీవలే తన ప్రియుడితో బ్రేకప్ చేసుకుంది. అయితే కొంత కాలం నుంచి అలీఘా మేసన్ అనే నల్లజాతి యువతితో కేటలిన్ ప్రియుడు సన్నిహితంగా ఉంటున్నాడు.
ఈ క్రమంలో తన మాజీ ప్రియుడు, మేసన్తో కలిసి డ్యాన్స్ చేయడాన్ని గుర్తించింది. దీనిపై ఆగ్రహం చెందిన కేటలిన్, మేసన్పై జాత్యహంకార దాడులు మొదలుపెట్టింది. నల్లజాతి వారితో నీకు సంబంధాలేంటి, నీకు ఇంకెవరూ దొరకలేదా అంటూ బాయ్ ఫ్రెండ్పై కూడా నోరు పారేసుకుంది. మేసన్తో అసభ్యంగా మాట్లాడుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ట్విటర్లో ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం కేటలిన్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. అతడు ఇప్పుడు నీ ప్రియుడు కాదన్న విషయం గుర్తుంచుకోవాలని, జాతి అంటూ కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని కొందరు హెచ్చరించారు.
బాధితురాలు మేసన్ స్పందిస్తూ.. 'నాకు మద్ధతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. కేటలిన్ చేసింది తప్పే కానీ, ఆమె తన తప్పును తెలుసుకుంటే చాలు. ప్రతిరోజూ ఇలాంటి జాత్యహంకార దాడులు ఏదో ఓ చోట జరుగుతున్నాయి. వాటి విషయంలో కూడా బాధితులకు మీరు అండగా నిలవాలని' కోరారు.