పోలీసుల వేధింపుల వల్లే కౌశిక్ కుటుంబం బలవన్మరణం!
సస్పెండైన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల హస్తం
హైదరాబాద్: బెంగళూరులో గత నెల 27న రియల్ ఎస్టేట్ వ్యాపారి కౌశిక్ పునీత్‌శర్మ భార్య, ఇద్దరు పిల్లలు సహా ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కేసు కొత్త మలుపు తిరిగింది. ఓ భూమి వివాదంలో పోలీసుల వేధింపుల వల్లే వారు బలవన్మరణానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. నెల్లూరుకు చెందిన హవాలా వ్యాపారి సతీష్‌రెడ్డే కౌశిక్ పునీత్‌శర్మ అని బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. సతీష్‌రెడ్డి పేరుతో ఉన్న పాస్‌పోర్టు కౌశిక్ ఇంట్లో లభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో హవాలా వ్యాపారంలో పెద్ద మొత్తంలో నష్టాలు రావడంతో బడా వ్యాపారులు తనను వేధిస్తారన్న ఉద్దేశంతోనే తాను చనిపోయినట్లుగా సతీష్‌రెడ్డి నాటకమాడినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది.
తర్వాత అక్కడి నుంచి పారిపోయి బెంగళూరుకు వచ్చిన సతీష్‌రెడ్డి... తన పేరును కౌశిక్ పునీత్శర్మగా మార్చుకున్నాడు. అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నా... తనకు పెళ్లి కాలేదని నమ్మించి శ్రీలత అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికీ కూతురు శ్రీరక్ష, కుమారుడు కౌస్తుబ్ సం తానం. హవాలా వ్యాపారం వదిలేసి రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించిన కౌశిక్ కోట్ల రూపాయల ఆస్తికి పడగలెత్తాడు. ఈ క్రమంలోనే ఓ భూ వివాదంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఇటీవల సస్పెన్షన్‌కు గురైన ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు వేధించడం వల్లే కౌశిక్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని బెంగళూరు పోలీసుల విచారణలో తేలింది.