వందేళ్ళ వయసులో '100 మీటర్ల' రికార్డు
వందేళ్ళ వయసులో వంద మీటర్ల పరుగు... ఊహించడానికే కష్టంగా కనిపిస్తుంది కదూ... కానీ ఆ పోటీల్లో పాల్గొని ఏకంగా కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది ఇడా కీలింగ్. వందేళ్ళు జీవించడమే ఓ రికార్డుగా మారుతున్న ఈ కాలంలో వందేళ్ళ వయసులో వందమీటర్ల రేసులో పాల్గొని ఆమె ప్రపంచ రికార్డును సాధించింది. 80 ఏళ్ళ ఇతర పోటీదారుతో రేసులో కేవలం అత్యంత తక్కువ సమయంలో పరుగును పూర్తి చేసి ఇంతకు ముందున్న రికార్డును బ్రేక్ చేసింది.
ఇడా కీలింగ్... వందేళ్ళ వయసులోనూ వంద మీటర్ల రేసులో పాల్గొనేందుకు వెనుకాడలేదు. పాల్గోవడమే కాదు ఏకంగా ఇంతకు ముందున్నజమైకా స్పింటర్ ఉసేన్ బోల్ట్ నెలకొల్పిన 9.56 సెకన్లలో 100 మీటర్ల ప్రపంచ రికార్డును తిరగరాసింది. కేవలం 1 నిమిషం17.33 సెకన్లలో వంద మీటర్ల రేస్ ను అవలీలగా పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. పెన్ రిలే కార్నివాల్ గా పిలిచే పెన్ రిలే పోటీలు అమెరికాలో నిర్వహించే అత్యంత పురాతన, అతి పెద్ద ట్రాక్, ఫీల్డ్ పోటీలు. ఇవి ప్రతి యేటా ఏప్రిల్ 21 నుంచి నిర్వహిస్తుంటారు. ఫిలడెల్ఫియా ఫ్రాంక్లిన్ ఫీల్డ్ లోని యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా 1895 నుంచి ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఈసారి పోటీల్లో పాల్గొని రికార్డును సాధించిన ఇడా కీలింగ్... రుచికోసం తినొద్దని, పోషక పదార్థాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలని, రోజుకోసారైనా వ్యాయామం చేయాలని క్రీడాకారులతోపాటు, సాధారణ ప్రజలకూ సలహా ఇచ్చింది. అంతేకాదు మనల్ని మనమే ప్రేమించుకోవాలని, మనమేం చేయాలనుకుంటున్నామో అది చేయాలని, మనకోసం ఎవ్వరూ ఏమీ చేయరంటూ సూచించింది.
పౌర హక్కుల ఉద్యమ సమయంలో ఎంతో చురుగ్గా పాల్గొన్న కీలింగ్ కు నలుగురు కొడుకులుండేవారు. దశాబ్దాల క్రితమే భర్త మరణించగా.. ఇద్దరు కొడుకులు తీవ్ర మాదక ద్రవ్యాల అలవాటుతో మృతి చెందినట్లు ఓ పత్రిక అందించిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. వయసు మీరుతుంటే ఒంటిపై పడే రోగాలకు పరుగే తన ప్రధాన చికిత్సగా మార్చుకున్న కీలింగ్... మొదటిసారి 67 ఏళ్ళ వయసులో రేసింగ్ లో పాల్గొంది. ఆ తర్వాత తన పరుగును ఎప్పుడూ ఆపలేదని ఓహియో బీకన్ జర్నల్ లో నివేదించిన వివరాలను బట్టి తెలుస్తోంది.