ఇంటింటికి కిలో చికెన్
కోవెలకుంట్ల, న్యూస్‌లైన్: ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ నాయకులు ఓ విన్నూత పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఉయ్యాలవాడ మండలంలోని అల్లూరు గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటికి కిలో చికెన్ పథకం అమలు చేసేందుకు రంగంలోకి దిగారు. స్థానికంగా చికెన్‌ధర కిలో రూ. 120 నుంచి రూ. 150 వరకు ధర పలుకుతుండటంతో తాడిపత్రిలో కిలో రూ. 80 ధర ఉందని తెలుసుకుని దాదాపు 200 కిలోల చికెన్ తెప్పించారు. శనివారం చీకటిపడ్డాక ఓటర్ల ఇంటి వద్దకు వెళ్లి పంపిణీకి శ్రీకారంచుట్టారు.
గ్రామంలో నాలుగు ఇళ్లకు సరఫరా చేయగానే ఎండ వేడిమికి చికెన్ చెడిపోయిన వాసన వస్తున్నట్లు గమనించిన నాయకులు కంగుతిన్నారు. అదే చికెన్‌ను పంపిణీ చేస్తే ఓటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొవాల్సివస్తుందని భావించి గుట్టుచప్పుడు కాకుండా చికెన్‌ను తీసుకె ళ్లి గ్రామ శివారులోని పాలేరు వాగులో పడేసినట్లు తెలుస్తోంది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో ఓటర్లను మభ్యపెట్టేందుకు టీడీపీ నాయకులు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ముందు రోజు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు ఆ నాయకులు ప్రయత్నించారు. అయితే ఓటర్లు తిరస్కరించడంతో చికెన్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా వేసవికాలం కావడంతో అక్కడి నుంచి గ్రామానికి తీసుకొచ్చే క్రమంలో సుమారు 3 గంటల సమయం పట్టింది. దీంతో వేడి కారణంగా చికెన్ చెడిపోవడంతో టీడీపీ నాయకుల పథకం బెడిసికొట్టింది.