ఖజానా ఖాళీ
ఎక్కడిబిల్లులు అక్కడే
కోట్ల లావాదేవీలకు బ్రేక్
విద్యార్థులకు ఉపకార వేతనాలు నిల్
మధ్యాహ్న భోజనానికి డబ్బుల్లేవు
ఫీజు రీయింబర్స్మెంట్కూ దిక్కులేదు
జీతాల వరకు సర్ధుబాటు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
ఎక్కడ బిల్లులు అక్కడే నిలిచిపోయాయి. విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, పంచాయతీ రాజ్, ఆర్అండ్ బి, మున్సిపల్ తదితర శాఖల పనులకు సంబంధించిన బిల్లులకు బ్రేక్ పడింది. రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో కేవలం జీతాలు, పింఛన్లకు మాత్రమే సర్ధుబాటు చేస్తున్నారు. మిగిలిన అన్ని బిల్లులూ బ్యాంకుల నుంచి వెనక్కు తిరిగి వచ్చేస్తున్నాయి. జిల్లా కేంద్రం కాకినాడలోని జిల్లా ఖజానా అధికారి కార్యాలయం నుంచి ప్రతి నెలా సుమారు 200 విభాగాలకు వందల కోట్ల రూపాయలు చెల్లింపులు జరుగుతాయి. కానీ గత నెలాఖరు నుంచి జిల్లాలో అన్ని రకాల బిల్లులు పాస్ కాక విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు, పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లు వివాహ, కుటుంబ ఖర్చుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు పెట్టుకున్న రుణాలు, మధ్యాహ్న భోజనం, మెడికల్ రీ ఇంబర్స్మెంట్...ఇలా దాదాపు అన్ని బిల్లులు పెండింగ్లో పడ్డాయి.
జీతాల బిల్లులకు మాత్రమే గ్రీ¯ŒS సిగ్నల్...
ప్రభుత్వ ఆదేశాల మేరకు కేవలం జీతాల బిల్లులు మాత్రమే జిల్లాలో క్లియర్ చేస్తున్నారు. అది కూడా ఈ నెల (జనవరి) 21వ తేదీ నుంచి 30 తేదీ వరకు జీతాలతో సహా ఏ ఒక్క బిల్లు కూడా మంజూరు కాలేదు. పెద్ద నోట్లు రద్దు అనంతరం సాంకేతికంగా వచ్చిన మార్పుల నేపథ్యంలో ఖజానా శాఖలో ఎస్టీఓల పా¯ŒS నంబర్లు తప్పని సరిచేశారు. సొంత పా¯ŒS నంబర్లు ఇవ్వడం వల్ల తమకు ఐటి శాఖ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని గత వారం ఖజానా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి గతంలో మాదిరిగానే బిల్లులు మంజూరు చేయవచ్చునని, ఎస్టీఓల పా¯ŒS నంబర్లు అవసరం లేదని మంగళవారం రాత్రి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి.అలాగే ఖజానా నుంచి జీతాలు బిల్లులు సర్థుబాటు చేయాలనే ఆదేశాలు కూడా రావడంతో బుధవారం ఒకటో తేదీకి జీతాలు, పింఛ¯ŒSదారులకు ఇబ్బందులు తొలగిపోయినట్టే. సుమారు 45 వేల మంది ఉద్యోగులకు జీతాలుగా రూ.191 కోట్లు, 40 వేల మంది పెన్షనర్లకు రూ.87 కోట్లు చెల్లింపులకు మార్గం సుగమమయింది.
విద్యార్థుల ఉపకార వేతనాల మాటేమిటి...?
మిగిలిన బిల్లులు ఎప్పటికి అనుమతిస్తారనే పరిస్థితి అర్థంకాక సంబంధిత వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన సుమారు లక్షన్నర మంది (బీసీ 60వేలు, ఎస్సీ 35వేలు, ఈబీసీ 25వేలు, ఎస్టీ 15వేలు నుంచి 20వేలు, మైనార్టీలు ఏడెనిమిది వేలు, వికలాంగులు ఐదువేలు)విద్యార్థులు ఉపకార వేతనాలు అందక నానా పాట్లుపడుతున్నారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు నెలనెలా ఠంఛ¯ŒSగా ఉపకారవేతనాలు (ఎంటీఎఫ్) ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ రెండు నెలలైనా ఉపకారవేతనాలు ఇవ్వలేని పరిస్థితి. రీ ఇంబర్స్మెంట్ ఆఫ్ ట్యూష¯ŒS ఫీజు (ఆర్టీఎఫ్)కు సంబంధించిన బిల్లులు కూడా నిలిచిపోయాయి. ఉపకార వేతనాలు, ఫీజు రీ ఇంబర్స్మెంట్ అన్ని బిల్లులు కలిపి సుమారు రూ.35 కోట్లు పెండింగ్లో ఉండిపోయాయి. జిల్లాలో కేవలం ఫీజు రీ ఇంబర్స్మెంట్పై ఆధారపడి నడుస్తున్న ఇంజినీరింగ్ కాలేజీల పరిస్థితి అయోమయంగా మారింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 800 ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఆర్టీఎఫ్ బిల్లులు మంజూరుకాక బ్యాంకుల నుంచి తిరిగి వచ్చేస్తుండటంతో నరకయాతన ఎదుర్కొంటున్నాయి.
జీపీఎఫ్కూ ఇబ్బందులే...
విద్యార్థుల ఫీజులతోపాటు జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్) నుంచి కుటుంబ అవసరాల కోసం ఉద్యోగులు రుణాలకు దరఖాస్తు చేసుకుని రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. జీపీఎఫ్కు సంబంధించి రూ.5 కోట్లు, విద్యార్థుల మధ్యాహ్న భోజనం బిల్లు రూ.3 కోట్లు, మున్సిపాలిటీలకు, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు తదితర శాఖలకు సం బంధించి రూ.380 కోట్లు (చెక్కుల రూపంలో) బిల్లులు ఖ జానా శాఖలో పేరుకుపోయాయి. మెడికల్ రీ యిం బర్స్మెంట్ రూ.50 లక్షలు, సరెండర్ లీవ్స్ రూ.8 కో ట్లు, రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ రూ.3 కోట్లు మేర బిల్లుల కోసం గత నెల నుంచి ఎదురుచూస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా...
బిల్లులు ఆపమని ప్రభు త్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులూ రాలేదు. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పై నుంచి ఏ బిల్లులకు అనుమతి ఇవ్వమంటే వాటికే సర్థుబాటు చేస్తున్నాం. ఫ్రీజింగ్ అనే విషయం మా దృష్టికి రాలేదు.అనుమతి రాగానే మిగిలిన బిల్లులు కూడా క్లియర్ చేస్తాం.
– పి.భోగారావు, జిల్లా ఖజానా అధికారి, కాకినాడ.