ఖమ్మం టీడీపీ టిక్కెట్‌ను మున్నూరు కాపులకే కేటాయించాలి
ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌లైన్: టీడీపీ ఆవిర్భావ దినోత్సవాల సాక్షిగా మరోసారి తెలుగు తమ్ముళ్ళు గళం విప్పారు. బీసీలో బలంగా ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఖమ్మం అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబును, జిల్లా పార్టీ అధ్యక్షుడితోపాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నగర నాయకులు డిమాండ్ చేశారు. టీడీపీ 33వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన వేడుకలకు ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మినారాయణ, పోట్ల నాగేశ్వరరావు హాజరయ్యారు.
జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు తదితరులు మాట్లాడిన తరువాత వార్డు మాజీ కౌన్సిలర్ కాసర్ల వీరభద్రం మాట్లాడుతూ.. సార్వత్రి ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు ఇస్తానని పార్టీ అధినేత చంద్రబాబు చెబుతున్నందున, ఖమ్మం ఆసెంబ్లీ సీటును బీసీల్లో బలంగా ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరంలో మున్నురు కాపు ఓటర్లు సుమారు 35వేల మందికి పైగా ఉన్నారని అన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి పనిచేస్తున్న తమకు సముచిత స్థానం దక్కలేదని, ఇప్పటికీ ద్వితీయ శ్రేణి నాయకులుగానే చూస్తున్నారని అన్నారు(దీనికి స్పందనగా... సమావేశంలోని వారంతా చప్పట్లు కొట్టారు).
పార్టీలో ఏ అవకాశమొచ్చినా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలకు అవకాశమిస్తున్నారని అన్నారు. వారి ఓట్లు కేవలం ఆరు నుంచి ఏడువేల మధ్యలో మాత్రమే ఉన్నాయన్నారు. ‘మాకు ఎమ్మెల్యేగా నిలబడే అర్హత లేదా?’ అని నాయకులను ప్రశ్నించారు. ప్రస్తుత ఎన్నికల్లో తమ సామాజిక వర్గానికి అవకాశమివ్వాలని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ దశలో.. ఎంపీ నామా నాగేశ్వరరావు కల్పించుకుని మాట్లాడారు. ఎక్కువ ఓటర్లు ఉన్నందున వారికి సీటు అడిగే హక్కు ఉందని, అందులో తప్పు లేదని సర్దిచెప్పి అంతటితో సభను ముగించారు. సభ ముగిసిన తరువాత ఈ విషయం పార్టీ నేతల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.సమావేశంలో పార్టీ నాయకులు మదార్‌సాహెబ్, గాజుల ఉమామహేశ్వరరావు, పంతంగి వెంకటేశ్వర్లు, శెట్టి రంగారావు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.