అటవీ సిబ్బందిపై స్మగ్లర్ల దాడి
ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం పెంబి అటవీరేంజ్ పరిధిలో కలప అక్రమ తరలింపును అడ్డుకోబోయిన అటవీ, పోలీసు సిబ్బందిపై స్మగ్లర్లు దాడికి తెగించారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇచ్చోడ మండలం నారాయణగూడ, ఖానాపూర్ మండలంలోని పెంబీ అటవీ పరిధిలోని రాగిదుబ్బనాల ప్రాంతంలో అక్రమంగా కలప తరలిస్తున్నారనే సమాచారం అందటంతో అటవీ అధికారి శంకర్, పెంబీ ఎస్సై నజీర్, తమ సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి కాపు కాశారు.
ఎడ్ల బండ్లపై కలప తరలిస్తూ తారస పడిన స్మగ్లర్లను నిలువరించేందుకు వారు ప్రయత్నం చేశారు. అయితే, స్మగ్లర్లు రాళ్లు, గొడ్డళ్లతో వారిపైకి దాడికి దిగారు. ఈ ఘటనలో రేంజ్ అధికారి శంకర్తోపాటు మరో ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. దీంతో పలుసార్లు హెచ్చరించినా పరిస్థితి అదుపులోకి రాకపోయేసరికి పోలీసులు ఒక్క రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు ఒకటిన్నర లక్షల రూపాయల విలువైన 22 టేకు దుంగలు, 6 ఎండ్లబండ్లను వదిలి స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు. స్మగ్లర్లపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో పెంబి అటవీ అధికారులు ఫిర్యాదు చేశారు.