‘భద్రత’ భారం పిల్లలపైనే..
* ఖర్చు భరించే స్థోమత తమకు లేదనిచేతులెత్తేస్తున్న ఎయిడెడ్ పాఠశాలలు
* ఫీజులు పెంచాలని యాజమాన్యాల యోచన
సాక్షి, ముంబై : ఎయిడెడ్ పాఠశాలల్లో ఫీజులు పెంచాలని యాజమాన్యాలు యోచిస్తున్నాయి. ఇటీవల పాకిస్థాన్ దేశం పెషావర్‌లో ఒక పాఠశాలలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో సుమారు 145 మంది విద్యార్థులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని పలు పాఠశాలల్లో భద్రతను పెంచాలని స్థానిక పోలీసులు జారీ చేశారు. దీనిపై ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు ఆలోచనలో పడ్డాయి. ఈ సందర్భంగా నగర ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల నిర్వాహకులు మాట్లాడుతూ.. పోలీసుల సూచనల ప్రకారం.. పాఠశాలల్లో భద్రతను పెంపొందించే స్తోమత తమ వద్ద లేదన్నారు.
ఫీజులు పెంచడం, లేదా ప్రభుత్వం ఇందుకు గాను ప్రత్యేక నిధులను కేటాయించడం ద్వారా మాత్రమే తాము భద్రతను కొంత మేర పెంచగలుగుతామని వెల్లడించారు. పెషావర్ ఉదంతం అనంతరం పాఠశాలల్లో భద్రత నిమిత్తం ఎటువంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తూ నగర పోలీసులు జీవో జారీచేశారు. పాఠశాల ప్రాంగణంలోని ప్రహరీ గోడను ఎనిమిది అడుగుల ఎత్తు వరకు పెంచి పైన బాబ్డ్ వైర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా సర్క్యూలర్‌లో పేర్కొన్నారు. పాఠశాలల్లో సీసీటీవీ కెమెరాలు, రౌండ్ ద క్లాక్ పర్యవేక్షించే వాకీ టాకీలతో కూడిన భద్రతా సిబ్బంది, ఇంటర్‌కం వంటి సదుపాయాలు ఏర్పాటుచేయాలన్నారు.
అంతేకాకుండా పాఠశాలలకు వచ్చే సందర్శకులను కూడా పరిశీలించాలని పేర్కొన్నారు. పోలీసు కమిషనర్ రాకేష్ మారియా ఈ అంశమై ఆదేశించారు. అయితే ఇంత మొత్తంలో తాము పాఠశాలల్లో భద్రత కల్పించలేమని ఎయిడెడ్ పాఠశాలల అధికారులు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయలు, నాన్‌టీచింగ్ సిబ్బందికి చెల్లించే జీతాల వరకు మాత్రమే తమకు ప్రభుత్వం నుంచి నిధులు అందుతున్నాయన్నారు. భద్రతకు సంబంధించిన ఖర్చు తామే భరిస్తున్నామని రాజ్య శిక్షన్ సంస్థ అసోసియేషన్ కార్యదర్శి ఆర్పీ జోషీ తెలిపారు. విద్యార్థుల భద్రతను అంతర్జాతీయ భద్రత అంశంగా పరిగణించి ప్రభుత్వమే నిధులు కేటాయించాలని జోషి అభిప్రాయ పడ్డారు.