చిద్విలాసంగా...
దేవుడు తనను ద్వేషించినా దేవుడు బాధ పడడు. సాటి మనిషిని ద్వేషిస్తే మాత్రం కచ్చితంగా బాధపడతాడు. సాటి మనిషిలో తనని చూస్తే కచ్చితంగా కటాక్షిస్తాడు. సింపుల్‌గా చెప్పాలంటే ‘గోపాల గోపాల’ కథాంశమిదే. తనకు అన్యాయం జరిగిందని దేవునిపైనే కేసు వేసే ఒక మనిషి కథ ఇది. ఆ సామాన్యుడి పాత్రను వెంకటేశ్ పోషిస్తుండగా, శ్రీకృష్ణునిగా పవన్‌కల్యాణ్ నటిస్తున్నారు. కిశోర్‌కుమార్ పార్థసాని దర్శకత్వంలో డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. మరో వైపు పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ కూడా జరుపుకుంటోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని, టీజర్‌ని శుక్రవారం విడుదల చేశారు.
శ్రీమహావిష్ణువు తరహాలో ఊయల్లో పడుకుని చిద్విలాసం చేస్తూ పవర్‌స్టార్, ఆయనను అనుకరిస్తూ ఆటపట్టిస్తున్న వెంకటేశ్‌లతో ఫస్ట్‌లుక్ ఆసక్తి రేపుతోంది. సంక్రాంతికి రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీయ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అలనాటి బాలీవుడ్ సూపర్‌స్టార్ మిథున్ చక్రవర్తి ప్రత్యేక పాత్ర పోషిస్తుండటం మరో విశేషం. నిర్మాత డి. సురేశ్‌బాబు రెండో కుమారుడు డి. అభిరామ్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
పోసాని కృష్ణమురళి, ఆశిష్ విద్యార్థి, మురళీశర్మ, కృష్ణుడు, రంగనాథ్, రాళ్లపల్లి, భరణి, మధుశాలిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మాండలియా, ఉమేశ్ శుక్లా, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: అనూప్ రూబెన్స్, కూర్పు: గౌతంరాజు, నిర్మాణం: సురేశ్ ప్రొడక్షన్ ప్రై.లిమిటెడ్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లిమిటెడ్.