రాజకీయ చైతన్యంతోనే సమాజంలో మార్పు
కోడేరు (ఆచంట) : యువత రాజకీయ చైతన్యం పొందడం ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మంతెన సీతారామ్ అన్నారు. కోడేరులోని ఆత్మీయ సేవా కేంద్రంలో నిర్వహిస్తున్న యువ కమ్యూనిస్టుల అధ్యయన శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సీతారామ్ మాట్లాడుతూ పాలకులు యువతను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారన్నారు. యువతను కులం, మతం, ప్రాంతాల వారీగా విభజించి వారి ఐక్యతను దెబ్బదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత, విద్యార్థుల్లో రాజకీయ చైతన్యం పెంచేందుకు తోడ్పడుతున్న సెంట్రల్ యూనివర్సిటీలలో బీజెపీ, దాని అనుబంధ సంఘాలు ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. హెచ్‌సీయూలో వేముల రోహిత్, జేఎన్‌యూలో కన్హయ్యకుమార్‌లపై జరిగిన దాడులే ఇందుకు నిదర్శనమన్నారు. శిక్షణ తరగతులకు శివకుమార్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. ఈ తరగతుల్లో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కేతాగోపాలన్, పార్టీ నాయకులు ఎస్వీఎస్ శర్మ, పి.అనూరాధ, ఎ. అరుణ్‌కుమార్, పి.మంగరాజు, బత్తుల విజయ్‌కుమార్, కె.సుధీర్, వద్దిపర్తి శ్రీనివాసు, తోటపల్లి సత్యనారాయణ, వద్దిపర్తి అంజిబాబు, పాల్గొన్నారు.