‘వర్దా’రుణం
కొట్టుకుపోతున్న కోనపాపపేట
సముద్రం పాలైన 25 మత్స్యకారుల ఇళ్లు
కడలి ఆగ్రహానికి ముక్కలవుతున్న హేచరీలు
భారీగా ఆస్తి నష్టం
కానరాని రక్షణ చర్యలు
వర్దా తుపాను కొత్తపల్లి మండల తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. ఎక్కడ చూసినా సుమారు 50 మీటర్ల మేర ముందుకు చొచ్చుకువచ్చిన సముద్రం తీరప్రాంతాన్ని కబళీంచేసింది. ఏక్షణంలోనైనా సముద్ర కోతకు గురయ్యే ప్రమాదస్థితిలో పలు ఇళ్లు ఉన్నప్పటికి పట్టించుకునే వారు లేక పోవడంతో మత్స్యకారులు ఆ గృహాలలోనే బిక్కుబిక్కుమంటు కాలం గడుపుతున్నారు.
– పిఠాపురం
పొన్నాడ శివారు కోనపాపపేట తీవ్ర కోతకు గురైంది. సుమారు 25 మత్స్యకారుల ఇళ్లు నేలమట్టమై సముద్రంలో కలిసిపోగా, పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరికొన్ని ఏక్షణంలోనైనా సముద్రకోతకు గురయ్యే ప్రమాద పరిస్థితిలో ఉన్నాయి. కొందరు మత్స్యకారులు సామగ్రిని ఇతర ప్రాంతాలకు తరలించుకునే పనిలో ఉన్నారు. మరోపక్క తీరం వెంబడి ఉన్న పలు రొయ్యపిల్లల ఉత్పత్తి కేంద్రాలు (హేచరీలు) సముద్రకోతకు గురయ్యాయి. సుమారు 10 హేచరీలకు చెందిన పంప్‌హౌస్‌లు కడలిలో కలిసి పోయి సుమారు రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మంగళవారం ఉదయానికి కెరటాల తీవ్రత తగ్గక పోగా కోత కొనసాగుతుండడంతో హేచరీల యాజమానులు తమ కట్టడాలను కాపాడుకునేందుకు ఇసుక బస్తాలతో రక్షణ ఏర్పాటు చేసుకోవడంలో మునిగిపోయారు. కోనపాపపేట వద్ద బీచ్‌రోడ్డు అడుగుభాగం పూర్తిగా కొట్టుకు పోవడంతో ఏక్షణంలోనైనా రోడ్డు తెగిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఉప్పాడ తుని మధ్య బీచ్‌రోడ్డుపై రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. పరిస్థితి ఇలా ఉన్నా అధికారిక యంత్రాంగం మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.