సీరియల్ ‘అయితే ఓకే’
హాస్య నటుడు కొండవలస లక్ష్మణరావు - ఇంటర్వ్యూ
కౌతవరం (గుడ్లవల్లేరు) : ప్రముఖ హాస్య నటుడు కొండవలస లక్ష్మణరావు ఇకపై టీవీ సీరియల్స్‌లో కూడా నటించనున్నారు. వంశీ దర్శకత్వంలో నిర్మితమైన ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’లో అయితే ఓకే.. డైలాగ్ చెప్పడం ద్వారా పాపులర్ అయినా కొండవలస ఇకమీదట సీరియల్స్‌లో నటించేందుకు ఓకే అనేశారు. ఆయన నటించే తొలి సీరియల్ షూటింగ్ గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో శనివారం నుంచి జరుగనుంది. శుక్రవారం జన్మదినం జరుపుకుంటున్న ఆయన షూటింగ్లో పాల్గొనేందుకు రాత్రి కౌతవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా కొండవలస ‘సాక్షి’తో ముచ్చటించారు.
ప్రశ్న : మీ బర్త్‌డే ప్రత్యేకత ఏంటి?
కొండవలస : నా జీవితంలో ఇది 68వ జన్మదినం. ఈ పుట్టిన రోజును మరచిపోలేను. ఎందుకంటే సీరియల్లో తొలిసారిగా నటిస్తున్నాను.
ప్రశ్న : సీరియల్లో నటించడానికి కారణం?
కొండవలస : ఈ సీరియల్ నిర్మాత చల్లపల్లి అమరప్రసాద్ నా బెస్ట్ ఫ్రెండ్. అందుకే నటిస్తున్నా.
ప్రశ్న : ఇకపై సీరియళ్లలో నటిస్తారా?
కొండవలస : అభ్యంతరం ఏమీ లేదు కానీ సమయపాలన ఉండదు. మాకూ పెద్ద వయసు వచ్చేసింది కదా.. కొంచెం ఇబ్బందే.
ప్రశ్న : సినిమాలకు ముందు ఏం చేసేవారు?
కొండవలస : విశాఖపట్నం పోర్టులో ఉద్యోగం చేసేవాడ్ని.
ప్రశ్న : మీ స్వస్థలం ఏది?
కొండవలస : మాది శ్రీకాకుళం జిల్లా కొండవలస. మా ఇంటి పేరూ అదే.
ప్రశ్న : నాటక రంగ ప్రవేశం ఉందా?
కొండవలస : ఉండటమేంటి? స్వీయ దర్శకత్వంలోనే 250నాటకాలను రాష్ట్రంలోని 2వేల చోట్ల ప్రదర్శించాం.
ప్రశ్న : నాటకాల్లో మీ గురువు ఎవరు?
కొండవలస :గురువు ఒకరేమిటి? ఇద్దరున్నారు. అత్తిలికి చెందిన కృష్ణారావు, హైదరాబాదుకు చెందిన చాట్ల శ్రీరాములు. శ్రీరాములు దర్శకత్వంలో మెలకువలు నేర్పారు.
ప్రశ్న : నాటకాలకు ఎన్ని అవార్డులు వచ్చాయి?
కొండవలస : 378అవార్డులతో పాటు రెండు నంది అవార్డులు లభించాయి.
ప్రశ్న : సినిమాల్లో ఏవైనా అవార్డులు వచ్చాయా?
కొండవలస : రాలేదు గాని గుంతకల్లుకు చెందిన కళాభిమానులు నాకు హాస్యరత్న అవార్డు ప్రదానం చేసి సత్కరించారు.
ప్రశ్న : ఏ సంవత్సరంలో సినీ రంగంలోకి అడుగు పెట్టారు?
కొండవలస :2003లో వంశీ దర్శకత్వంలో అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో సినీ రంగానికి పరిచయమయ్యా.
ప్రశ్న : వంశీ పరిచయం ఎలా జరిగింది?
కొండవలస : రెండువేల సంవత్సరంలో ద్రాక్షారామంలో నాటక ప్రదర్శనకు వెళ్లాను. ఆ నాటకాన్ని వంశీ చూశారన్న విషయమే నాకు తెలియదు. బస్సు కోసం హడావుడిగా వెళ్తుంటే ఆయన్ను పరిచయం చేశారు. నాటకం బాగోకపోయినా నీ యాక్షన్ బాగుందంటూ ఆయన కితాబిచ్చారు.
ప్రశ్న : కొత్త సినిమాల్లో ఏమైనా నటిస్తున్నారా?
కొండవలస : హాస్య నటుడు ధనరాజ్ హీరోగా నటిస్తున్న సినిమాలో అతనికి మామ పాత్రలో నటిస్తున్నా. నిర్మాత అడ్డాల చంటి సినిమాలో అవకాశం వచ్చింది. పసుపులేటి వెంకటరమణ తీస్తున్న సినిమాలో మరో అవకాశం రానుంది.
ప్రశ్న : మీరు నటించే ఈ నేల.. ఈ గాలి ఈ సీరియల్లో మీ పాత్ర ఏమిటి?
కొండవలస : ప్రముఖ నటుడు గౌతంరాజుకు మామ క్యారెక్టర్ చేస్తున్నాను.
ఐతే ఓకే డైలాగ్ ప్రత్యేకత ఏమిటి?
కొండవలస : అది నా సొంత డైలాగ్ కాదు. సితార సినిమాలో వాడేందుకు వంశీ రాసుకున్నారట. ఆ డైలాగ్‌ను నా క్యారెక్టర్‌కు వాడారు.