సీఐడీ ఎస్ఐ ఇంట్లో దొంగతనం
గుడివాడ టౌన్, న్యూస్‌లైన్ : పట్టణంలోని ఓ ఇంట్లో శనివారం దొంగలు పడి 18 కాసుల బంగారు నగలు అపహరించుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పంచవటి కాలనీలో నివాసం ఉంటున్న కొండేటి రామ్‌ప్రసాద్ విజయవాడలోని సీఐడీ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు.
రామ్‌ప్రసాద్ దంపతులు శనివారం రాత్రి ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళ్లారు. తిరిగి వచ్చాక నగలను తీసి డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో ఉంచారు. తలుపులు దగ్గరకు వేసి అడ్డంగా మంచాలు వేసి నిద్రించారు. దొంగలు చాకచక్యంగా ఇంట్లోకి చొరబడి రెండు సెల్ఫోన్లు, 18 కాసుల బంగారు నగలు, రూ.4,500 నగదు అపహరించుకపోయారు.
రామ్‌ప్రసాద్ దంపతులు ఆదివారం ఉదయం లేచి ఇంట్లో దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. టూటౌన్ సీఐ ఏబీజీ తిలక్, ఎస్సై రాజేంద్రప్రసాద్ సిబ్బందితో వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.