కొండరెడ్డి గ్రామాల్లో ట్రైనీ ఐఏఎస్‌ల పర్యటన
కొటారుగొమ్ము(వీఆర్‌పురం), న్యూస్‌లైన్: మండలంలోని మారుమూల కొండరెడ్డి గిరిజన గ్రామాలు కొటారుగొమ్ము, పోచవరం తదితర గ్రామాల్లో మంగళవారం ట్రైనీ ఐఏఎస్‌లు పర్యటించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో మొత్తం 18 మంది ట్రైనీ ఐఏఎస్‌ల బృందం ఈ ప్రాంతంలోని గిరిజనుల జీవన విధానాన్ని, వారి ఆదాయ మార్గాలను, ప్రభుత్వం ద్వారా అందుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు.
తొలుత వారు కొటారుగొమ్ము గ్రామంలో గిరిజనులతో సమావేశమై మాట్లాడారు. గ్రామంలో ఇటీవల నిర్వహించిన పెసా గ్రామసభ, గ్రామంలో అమలవుతున్న ఉపాధి హామీ పనులను గురించి ఎస్‌ఓపీటీజి మల్లీశ్వరి వారికి వివరించారు. అనంతరం గ్రామస్తులతో వారు మాట్లాడారు. అడవులను రక్షించుకోవాలని, తద్వారా పర్యావరణ సమతులంగా ఉంటుందని తెలిపారు అనంతరం స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని, పోచవరంలోని అంగన్వాడీ కేంద్రాన్ని, బాలబడి కేంద్రాలను సందర్శించి పిల్లలతో మాట్లాడారు.
అక్కడి నుంచి బోట్లో తుమ్మిలేరు, కాకిసునూరు గ్రామాల మీదుగా పేరంటపల్లి చేరుకొని అక్కడి ప్రాచీన శివాలయాన్ని దర్శించుకున్నారు. అక్కడి గిరిజనుల ఆచార సంప్రదాయాలను తెలుసుకున్నారు. అలాగే గిరిజనులు వెదురుతో తయారు చేసి విక్రయించే వస్తువులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ శ్రీనివాస్, పీఎంఆర్‌డీ ఎన్.ప్రతిమ, ఎస్‌ఓపీటీజీ మల్లీశ్వరి, ఏటీడబ్ల్యూఓ సీతారాములు పాల్గొన్నారు.