ఆ సీటు టీడీపీకా.. జనసేనకా?
ఏపీలో కలిసి పోటీచేస్తామని ప్రకటించుకున్న టీడీపీ, జనసేన మధ్య అప్పుడే వివాదాలు, తగాదాలు మొదలయ్యాయి. రెండు పార్టీలు ఎక్కడెక్కడ పోటీ చేస్తాయనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కాని ఇరు పార్టీల నాయకుల మధ్య రచ్చ అయితే స్టార్ట్ అయింది. అనేక జిల్లాల్లో టీడీపీ, జనసేన పార్టీలకు అభ్యర్ధులే కనిపించడంలేదు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఎవరికి వారే పోటీలో ఉన్నామంటూ ప్రకటనలు చేసుకుంటున్నారు. టిక్కెట్ తమదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. సైకిల్, గ్లాస్ పార్టీల టిక్కెట్ల లొల్లి ఏ రేంజ్లో ఉందో చూద్దాం.
రానున్న ఎన్నికల్లో పొత్తుకు సిద్ధమైన తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య టిక్కెట్లు ప్రకటించకముందే ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పలు జిల్లాలలో తెలుగుదేశం, జనసేన నేతలు టిక్కెట్లు తమకే ఇస్తున్నారంటూ చేసుకుంటున్న ప్రచారం ఆయా రెండు పార్టీల మధ్య కుంపట్లు రగులుతున్నాయి. విశాఖ నుంచి కృష్ణా వరకు ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఈ రచ్చ మరీ ఎక్కువైంది. విశాఖ తూర్పు నుంచి మళ్లీ పోటీ చేస్తున్నట్లు టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు ప్రకటించుకోగా...ఇదే స్ధానంపై ఆశలు పెట్టుకుని వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణయాదవ్కి ఇపుడు టిక్కెట్ వస్తుందో రాదో తెలియని అయోమయ పరిస్ధితి ఏర్పడింది. విశాఖ తూర్పులో కాకపోయినా భీమిలి నుంచైనా వస్తుందనుకుంటే..అక్కడ టీడీపీ తరపున మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగుతున్నట్లు తన అనుచరులకి చెప్పారంటున్నారు. గంటా శ్రీనివాసరావు ఉమ్మడి విశాఖ జిల్లాలోని చోడవరం లేదా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి పోటీ చేయాలని ముందుగా భావించారట. కానీ అక్కడ పరిస్ధితులు అనుకూలంగా లేకపోవడంతో భీమిలి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఎమ్మెల్సీ వంశీ పరిస్ధితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది.
అలాగే పెందుర్తి సీటు విషయంలోనూ రెండు పార్టీల మధ్య వివాదాలు తారాస్ధాయికి చేరాయి. పెందుర్తి సీటు తనదేనని టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చెప్పుకుంటుండగా... పెందుర్తి హామీపైనే జనసేనలో చేరిన పంచకర్ల రమేష్ బాబు సైతం టిక్కెట్ తనదే అని ప్రకటించుకుంటున్నారు. ఇద్దరి మధ్య టిక్కెట్ వార్ రోజురోజుకి పెరుగుతోంది. ఇక గాజువాకలోనూ ఇటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీను గాజువాక సీటు తనదేనని ప్రచారం చేసుకుంటుండగా...జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు కోన తాతారావు సైతం తాను పోటీ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. పాయకరావుపేటలో అయితే రెండు పార్టీల మధ్య యుద్దమే జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పాయకరావుపేట టీడీపీ సీటు తనదేనని చెప్పుకుంటుండగా...అనితకి సీటు ఇస్తే తామెవ్వరమూ మద్దతివ్వబోమని జనసేన నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. జనసేనకే పాయకరావుపేట సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
తన కుమారుడికి అనకాపల్లి టిక్కెట్ ఆశిస్తూ వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు దాడి రత్నాకర్ ల పరిస్ధితి కూడా ఇలాగే ఉంది. అనకాపల్లి టిక్కెట్ కన్ ఫర్మ్ అని చెప్పుకుంటున్న తరుణంలో ఆయన రాజకీయ శత్రువు కొణతాల రామకృష్ణ జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. కొణతాలకి అనకాపల్లి టిక్కెట్ ఇస్తామని చెప్పిన తర్వాతే ఆయన జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్నారంటున్నారు. ఈ సీటు జనసేనకి కేటాయిస్తే టీడీపీలో చేరిన దాడి వీరభద్రరావు ఏం చేస్తారనే చర్చ ఇపుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. దీంతో ఇపుడు ఈ అనకాపల్లి సీటు టీడీపీకా.. జనసేనకా అన్న మీమాంసలో అధినేతలు ఉన్నారట. కాకినాడ సీటుపై జనసేన నేత ముత్తా శశిధర్ గట్టిగానే పట్టుబడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తనకి హామీ ఇచ్చారని...కాకినాడ సీటు తనదేనని ముత్తా శశిధర్ చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కూడా కాకినాడ సీటు తనదేనని చెప్పుకుంటున్నారు.
ఇక పిఠాపురం సీటు తనదేనని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రకటించుకుంటుండగా...ఆ సీటు కోసం జనసేన తరపున టీ టైం అధినేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక రాజమండ్రి రూరల్ సీటు కోసం కూడా టీడీపీ-జనసేన మధ్య బహిరంగంగానే మాటల యుద్దం నడుస్తోంది. ఇక్కడ నుంచి మరోసారి పోటీకోసం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిద్దపడుతుండగా ..జనసేన నుంచి పోటీకి కందుల దుర్గేష్ ప్రయత్నిస్తున్నారు. కందుల దుర్గేష్ కి రాజమండ్రి రూరల్ ఇవ్వాల్సిందేనని జనసేన అధినేత పట్టుబడుతున్నారట.
తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం నుంచి టీడీపీ తరపున మరోసారి పోటీకి మాజీ డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప చూస్తుండగా...ఇదే సీటు కోసం జనసేన నేత తుమ్ముల రామస్వామి అలియాస్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు సీటు కోసం టీడీపీ, జనసేనల మధ్య వార్ కొనసాగుతోంది... ఇక్కడ నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్నట్లుగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు చెప్తుండగా... జనసేన తరపున ఇదే టిక్కెట్ ను బొంతు రాజేశ్వరరావు ఆశిస్తున్నారు. ఇక ముమ్మిడివరంలో దాట్ల బుచ్చిబాబు టీడీపీ టిక్కెట్ రేసులో ఉంటే జనసేన తరపున పితాని బాలకృష్ణ ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు.
కొత్తపేట నియోజకవర్గంలో అయితే సీటు కోసం అన్నదమ్ములే సవాళ్లు విసురుకుంటున్నారు. ఇక్కడ టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు టిక్కెట్ రేసులో ఉంటే ఆయన సొంత తమ్ముడు బండారు శ్రీనివాస్ జనసేన టిక్కెట్ రేసులో ఉన్నారు. గత ఎన్నికల సమయంలోనూ ఇద్దరూ ఆయా పార్టీల తరపున పోటీ చేశారు. సోదరులిద్దరి మధ్య విభేదాలు తారాస్ధాయికి చేరుకోవడంతో ఇపుడు టిక్కెట్ ఏ పార్టీకి ఇచ్చినా అది ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని ఇరు పార్టీల కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అనేక నియోజకవర్గాల్లో అసలు అభ్యర్థులు ఎవరంటూ వెతుక్కుంటున్న టీడీపీ, జనసేన పార్టీలకు...కొన్ని స్థానాల్లో మాత్రం సీట్ల కోసం రెండు పార్టీల మధ్య రచ్చ ఆసక్తికరంగా సాగుతోంది.