ఇంకో ఇటుక పేర్చినా.. యుద్ధమే
మెగా ఆక్వా ఫుడ్ పార్కుపై రాజకీయ, రైతు, మత్స్యకార నేతల అల్టిమేటం
నరసాపురం అర్బన్: పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో ఆక్వా ఫుడ్‌పార్కు నిర్మాణానికి ఇంకో ఇటుక పేర్చినా.. యుద్ధం తప్పదని రాజకీయ, రైతు, మత్స్యకార నేతలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఆక్వా ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా ఆదివారం మొగల్తూరు మండలం కొత్తోట గ్రామంలో భారీ బహిరంగ సభ జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభ దద్దరిల్లింది. సభ జరపడానికి వీల్లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించినా.. అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆందోళనకారుల లక్ష్యం ముందు అవేమీ నిలబడలేదు. సభలో ఆక్వా ఫుడ్‌పార్కు పోరాటంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ, రైతు, మత్స్యకార సంఘాల నేతలు భారీగా పాల్గొన్నారు. పార్కు నిర్మాణం విషయంలో ప్రభుత్వం నాటకాలాడుతోందని వారు విమర్శించారు.
ఓవైపు తాత్కాలికంగా పనులు ఆపుతున్నామని చెబుతున్న సర్కారు.. మరోవైపు కలెక్టర్‌తో.. ఈ ఫ్యాక్టరీ వల్ల ఇబ్బందులేమీ ఉండవని ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నించడంపై వారు మండిపడ్డారు. ఫుడ్‌పార్కు పనులను శాశ్వతంగా నిలిపేయాలని డిమాండ్ చేశారు. సభకు అధికార పార్టీ నేతలు కూడా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఇక పనులు జరగవని చెప్పి వెళ్లిపోయారు. తమ మాటలు కూడా వినాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కోరుతున్నా.. వినకుండా ఎమ్మెల్యే వేదిక దిగిపోవడంపై మధు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాటలు కాదు రాతపూర్వకంగా తెలియజేయాలని ఎమ్మెల్యేకు ఆయన సవాల్ విసిరారు.
సభలో మాజీ ఎమ్మెల్యే ఆర్.సత్యనారాయణరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు నెక్కంటి సుబ్బారావు, ఐద్వాజిల్లా కార్యదర్శి కమల, పాలంకి ప్రసాద్, బొమ్మిడి నాయకర్ తదితరులు మాట్లాడారు. ఇద్దరు పాశ్రామికవేత్తలకు కొమ్ముకాయడం కోసం, నాలుగు మండలాల ప్రజల జీవితాలను సర్కారు ఫణంగా పెడుతోందని వారు విమర్శించారు. సభకు మత్స్యకార సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బర్రె ప్రసాద్ అధ్యక్షత వహించారు. నరసాపురం, మొగల్తూరు, వీరవాసరం, భీమవరం మండలాలకు చెందిన ప్రజలు, రైతులు, మత్స్యకారులు 3 వేల మందికిపైగా పాల్గొన్నారు.
రాతపూర్వకంగా ఇవ్వాల్సిందే: మధు
ఫుడ్‌పార్కు నిర్మాణం చేపట్టబోమని ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ వచ్చేవరకూ ప్రజా పోరాటం ఆగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్పష్టం చేశారు. నాలుగు మండలాల ప్రజలు ఫుడ్‌పార్కు వల్ల కాలుష్యం పెరుగుతుందని, జీవనోపాధి కోల్పోతామని ఆందోళన చేస్తుంటే.. ప్రభుత్వం ఇప్పుడు తాత్కాలికంగా పనులు ఆపేస్తామని, ఈ నిర్మాణం వల్ల నష్టమేమీ జరగదని మభ్యపెట్టేందుకు యత్నించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
ప్రభుత్వం ప్రకటన చేయాలి: కొత్తపల్లి
గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్కు పేరుతో ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసే ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లో నిర్మించనివ్వబోమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు స్పష్టం చేశారు. సభలో కొత్తపల్లి ప్రాజెక్టు వల్ల గ్రామాలు ఎలా నష్టపోతాయో వివరించారు. ప్రాజెక్ట్‌ను రద్దు చేసే వరకూ పోరాటం ఆగదన్నారు.
మూల్యం చెల్లించుకోక తప్పదు: మాజీమంత్రి మోపిదేవి
అభివృద్ధి అనేది ప్రజల అంగీకారంతో జరగాలని, అధికారం ఉంది కదాని ప్రజలపై దౌర్జన్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ హెచ్చరించారు. కంపెనీలో తమ జీవితాలు బుగ్గవుతాయని ప్రజలు మొత్తుకుంటున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
పరిశ్రమలకు పచ్చని పొలాలు కావాలా: సీపీఐ రామకృష్ణ
ముఖ్యమంత్రికి పరిశ్రమలు పెట్టడానికి, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని పంటలు పండే పచ్చని పొలాలు, విలువైన భూములే కనిపిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. చవగ్గా భూములు దొరికే రాయలసీమలో ఎందుకు పరిశ్రమలు పెట్టడం లేదని ప్రశ్నించారు.