హాకీ టోర్నీ విజేత కృష్ణా జట్టు
రన్నర్స్‌గా పశ్చిమగోదావరి జట్టు
ముగిసిన పోటీలు
నెల్లూరు(బృందావనం): నగరంలోని వీఆర్ ఉన్నత పాఠశాల మైదానంలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఏడో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ బాలుర హాకీ చాంపియన్‌షిప్ పోటీలు సోమవారం సాయంత్రంతో ముగిశాయి. విజేతగా కృష్ణా, రన్నర్స్‌గా పశ్చిమగోదావరి, తృతీయస్థానంలో విశాఖపట్నం జిల్లా జట్టు నిలిచాయి. విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈఓ మువ్వా రామలింగం హాజరయ్యారు. ఈ సందర్భంగా హాకీ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ప్రదర్శించిన ఆటతీరు నామమాత్రంగా ఉందని, జాతీయస్థాయిలో రాణించాలంటే ఈ ప్రతిభ సరిపోదన్నారు. 45 ఏళ్లుగా హాకీ ప్రగతి కోసం కృషిచేస్తున్న తనకు ఈసారి క్రీడాకారులు ప్రదర్శించిన తీరు ఆవేదనకు గురిచేసిందన్నారు. విశాఖపట్నం జట్టులోని గోల్‌కీపర్ ప్రదర్శించిన ఆటతీరు మెరుగ్గా ఉందన్నారు. అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లోని అకాడమీల్లో శిక్షణ పొందిన క్రీడాకారులు ప్రదర్శించిన తీరు ఏ మాత్రం బాగొలేదన్నారు. నెల్లూరు జిల్లా అసోసియేషన్‌కు సహకారం అందించిన ఆనం సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ చెన్నకేశవరావు, జిల్లా అటవీశాఖ అధికారి చాణక్యరాజు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి రామ్మూర్తి, జిల్లా పీఈటీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణారెడ్డి, సనత్‌కుమార్, ధ్యాన్‌చంద్ హాకీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్‌రావు, సురేష్, జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శేషారెడ్డి, థామస్‌పీటర్, తదితరులు పాల్గొన్నారు.