ఆగని పోడు పోరు
వాజేడు: ఖమ్మం జిల్లా వాజేడు మండలం ఎర్రబోరు ప్రాంతంలో పోడు పోరు బుధవారమూ కొనసాగింది. ఈ భూమి విషయంలో కృష్ణాపురం గిరిజనులు, పోలీసులు, అటవీశాఖ సిబ్బంది మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరస్పరం ఘర్షణకు దిగడతంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది.గిరిజనులు ఈ భూమిని దున్నిన విషయం తెలుసుకొని పాల్వంచ, భద్రాచలం, వెంకటాపురం, దుమ్ముగూడెం, చర్ల, వాజేడు మండలాల అటవీశాఖ సిబ్బంది ఉన్నతాధికారులతో కలిసి పోలీస్‌శాఖ సమక్షంలో బుధవారం ఉదయం మొక్కలు నాటారు.
ఆ మొక్కలను తొలగించేందుకు గిరిజనులు భారీ సంఖ్యలో వచ్చారు. వారిని పోలీసు, అటవీశాఖ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. గిరిజన మహిళలు ముందుకు రావడంతో కొంత వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో పోలీసులను దాటుకుంటూ గిరిజనులు పోడుభూమిలోకి చొచ్చుకువచ్చి అటవీశాఖ సిబ్బంది వేసిన మొక్కలను పీకివేశారు. ఓవైపున అధికారులు, గిరిజనులు వాదులాడుకుంటుంటే మరోవైపున మరికొంత మంది గిరిజనులు నాగళ్లతో పోడుభూమిని దున్ని విత్తనాలు చల్లారు.
కొందరు గిరిజనులను పోలీసులు అదుపులోకి తీసుకొని జీపులోకి ఎక్కించగా, గిరిజన మహిళలు అడ్డుకున్నారు. కాగా, ఒకరిద్దరిపై కేసులు పెడితే ఊరుకునేది లేదని..కేసులు పెట్టాల్సి వస్తే అందరిపై పెట్టాలని భీష్మించుకు కూర్చున్నారు. తహశీల్దార్ వీరప్రకాశ్ వచ్చి అధికారులు, గిరిజనులతో మాట్లాడారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు గిరిజనులు, అటవీశాఖ సిబ్బంది భూమిలోకి రావద్దని ఆదేశించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఇరువర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయూయి.