కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: బీజేపీ
హైదరాబాద్: ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడం సాధ్యం కావడం లేదని సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను ఏ అంశాల ప్రాతిపదికన ఇవ్వాలనుకుంటున్నదో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు డిమాండ్ చేశారు.
ముస్లిం రిజర్వేషన్ల పెంపుపై పట్టుదల ఉంటే ఐదు రోజుల్లో ప్రత్యేక సమావేశం పెట్టి వారికి 12 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని సవాల్ చేశారు. గురువారం పార్టీ నాయకులు సుధాకరశర్మ, డి.వాసులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ముస్లింలకు ఆశ చూపించి గత ఎన్నికల్లో కేసీఆర్ ఓట్లు వేయించుకున్నారన్నారు. ప్రస్తుతం ముస్లిం రిజర్వేషన్ల ద్వారా రాష్ట్రంలో మత పరమైన రాజకీయాలు చేయాలని సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఓబీసీలకు పథకాల ఆశ చూపి సీఎం కేసీఆర్ తమ రిజర్వేషన్లలో కోత పెట్టె ప్రయత్నం చేస్తున్న విషయాన్ని బీసీలు గమనిస్తున్నారని కృష్ణ సాగర్ అన్నారు.