వేర్వేరు ప్రమాదాల్లో పది మందికి గాయాలు
గజపతినగరం, న్యూస్‌లైన్ : వేర్వేరు ప్రమాదాల్లో పదిమంది గాయాలపాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని మరుపల్లి జంక్షన్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆమదాలవలసకు చెందిన పాపారావు, సంధ్యారాణి, కృష్ణవేణి, దుర్గాప్రసాద్, అలజంగి భవానీ, కొణిశి గ్రామానికి చెందిన పాసల కొండదేముడు, దేవుపల్లి గ్రామానికి చెందిన ఎం.పైడిరాజు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో పాపారావు, కృష్ణవేణి, దుర్గాప్రసాద్, అలజంగి భవానీల పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా కేంద్రాస్పత్రికి రిఫర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
గుణుపూరుపేట వద్ద..
డెంకాడ : మండలంలోని గుణుపూరుపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. పూసపాటిరేగ మండలం కుమిలి నుంచి విజయనగరం వైపు వస్తున్న ఆటో ఊడుకులపేట వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో కుమిలికి చెందిన బమ్మిడి నర్సమ్మ, దున్న అప్పలనర్సమ్మ, గుణుపూరుపేటకు చెందిన కొండపు కొత్తయ్య గాయపడ్డారు. కూరగాయలు తీసుకుని విజయనగరంలోని రైతు బజార్లో విక్రయించేందుకు ఆటోలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేశారు.