ఏఐసీసీ పరిశీలకుని పర్యటన
నరసరావుపేట వెస్ట్, న్యూస్‌లైన్: నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై రాహుల్‌గాంధీ దూతలు ఆ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో సోమవారం పర్యటించారు. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పర్యటించారు. పట్టణంలోని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఏఐసీసీ ప్రతినిధి, కర్నాటక రాష్ట్ర మాజీ మంత్రి కె.శివమూర్తి నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఒక్కొక్కరినీ పిలిచి అభిప్రాయాలను సేకరించారు.
అధిక శాతం మంది మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డిని నరరావుపేట పార్లమెంటు అభ్యర్థిగా ఎంపిక చేయాలంటూ శివమూర్తికి నివేదించారు. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో మొదట్నంచీ కాసు కుటుంబీకులు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి చేస్తున్న కృషిని ద్వితీయశ్రేణి నాయకులు ఈ సందర్భంగా వివరించారు. ప్రతిసారి స్థానికేతరులను నరసరావుపేటకు తీసుకువచ్చి పార్లమెంటు అభ్యర్థిగా నియమిస్తున్నారని దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అనేక మంది పరిశీలకుని దృష్టికి తీసుకువచ్చారు.
ఈసారి కాసు కృష్ణారెడ్డికి పార్లమెంటు అభ్యర్థిగా అవకాశం ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనీ.. కొందరు నాయకులు స్వరం పెంచి మాట్లాడినట్లు సమాచారం. వినుకొండ నియోజకవర్గంలో కూడా అధిక శాతంమంది కాసు కృష్ణారెడ్డినే పార్లమెంటు అభ్యర్థిగా ఎంపిక చేయాలంటూ ఏఐసీసీ పరిశీలకుని వద్ద వాదన వినిపించినట్లు తెలిసింది.