టీడీపీలో రాజుకున్న అంతర్గత విభేదాలు
కొందరికి చెక్ పెట్టే రీతిలో ఎమ్మెల్యే వ్యూహం
మాజీ ఎంపీపీ తాతయ్యబాబుతోపాటు పలువురి అలక!
చోడవరం : మండల ప్రాదేశిక ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య అభిప్రాయ బేధాలు పొడచూపాయి. రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన కెఎస్ఎన్ఎస్ రాజు తనతోపాటు నియోజకవర్గంలో బలంగా ఉన్న కొందరు సీనియర్ నాయకులకు పార్టీలో ప్రాతినిధ్యం తగ్గించాలనే యోచనలో ఉన్నారన్నట్టు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో శుక్రవారం జరిగిన ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ ఎన్నికలను ఎమ్మెల్యే వేదికగా చేసుకొని వారిలో కొందరికి చెక్ పెట్టినట్టుగా అంతా భావిస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే టిక్కెట్ రేసు వరకు వెళ్లిన బుచ్చెయ్యపేట మాజీ ఎంపీపీ బత్తుల తాతయ్యబాబుకు ఈ ప్రాదేశిక ఎన్నికల్లో చావుదెబ్బ తగిలింది. ఈ మండలానికి సంబంధించి ఎంపీపీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వుడు కావడంతో ఎంపీపీతోపాటు తన అనుచరుడైన వడ్డాది -3 ఎంపీటీసీ సభ్యుడు దాడి సూరి నాగేశ్వరరావును వైఎస్ ఎంపీపీని చేసి మండలాన్ని తన ఆధిపత్యంలో ఉంచుకోవాలని తాతయ్యబాబు భావించారు.
ఈయన వ్యూహానికి ఎమ్మెల్యే చెక్ పెట్టారు. వడ్డాది ప్రాంతానికి కాకుండా ఎర్రవాయు ప్రాంతానికి ఎంపీపీ ఇచ్చి పరోక్షంగా తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఈ పరిణామంతో తాతయ్యబాబు అలిగి ప్రమాణస్వీకారానికి గైర్హాజరయ్యారు. ఇప్పటి వరకు ఒకే వర్గంగా ఉన్న బుచ్చెయ్యపేట మండలంలో ఇప్పుడు ప్రాంతాలు వారీగా వర్గ విభేదాలు చోటుచేసుకొన్నాయి. ఇదే మండలానికి చెందిన మరికొందరు నాయకులను సైతం ప్రాతినిధ్యం తగ్గించాలని ఎమ్మెల్యే యోచిస్తున్నట్టు తెలిసింది. ఇదిలావుంటే నియోజకవర్గ కేంద్రమైన చోడవరం మండలంలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది.
ఇప్పటికే గత జెడ్పీటీసీ ఎన్నికల్లో టిక్కెట్ రాక డీలా పడ్డ మజ్జి గౌరీశంకర్తోపాటు ఆయన మద్దతు దారులైన ఏటవతల గ్రామాల నాయకులు గరంగరంగా ఉన్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం ప్రయత్నించిన గోవాడ సుగర్ ప్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడుని, అతని సోదరుడు పెదబాబుకి ఇక్కడ గట్టి పట్టుంది. ఇప్పటి వరకు అన్నింటిలోనూ కలిసి మెలిసి ఉండే ఎమ్మెల్యే, మల్లునాయుడు, పెద్దబాబు తాజాగా జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో వేరుగా కనిపించారు.
ప్రమాణ స్వీకార ఏర్పాట్లు గూనూరు సోదర్లే అన్నీతామై చేసుకున్నారు తప్ప ఎమ్మెల్యే మాత్రం రాకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అలాగే ఏటవత ఉన్న గ్రామాల్లో నాయకులు కూడా ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రావికమతం, రోలుగుంట మండలాల్లో కూడా ఎమ్మెల్యే కొన్ని వర్గాల ఆధిపత్యాన్ని తగ్గించేందుకు చూస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. రావికమతం మండలంలో వైఎస్ ఎంపీపీ పదవిని నలుగురు ఆశించారు.
వీరిలో రావికమతం ఎంపీటీ సీ సభ్యుడు గెంజి కనకకు ఆ పీఠం దక్కింది. దీంతో ఈ పదవి ఆశించిన తీవ్రంగా భంగపడ్డ తట్టబంద ఎంపీటీసీ గోకివాడ చినరమణ ప్రమాణస్వీకార ఆవరణలోనే ఆగ్రహంతో ఊగిపోయారు. ఎమ్మెల్యే హామీ ఇచ్చి మోసం చేశారంటూ బహిరంగంగానే ధ్వజమెత్తారు. తాను రాజీనామా చేస్తానని హెచ్చరించారు. మరో పక్క రోలుగుంట మండలంలోనూ ఇదే పరిస్థితి. ఆఖరు నిమిషం వరకు వైఎస్ ఎంపీపీ ఎవరన్నది ఎమ్మెల్యే ప్రకటించక పోవడంపై పార్టీ నాయకుల్లో అసంతృప్తి రాజుకుంది.
ఆ పదవి కోసం ఆశిస్తున్న వారిలో ఎక్కుమంది ఉండటంతో ఆఖరి లో గుండుబాబు ఎంపీటీసీ పరికం లోవరాజును ప్రకటించారు. దీంతో ఈ పదవి ఆశించి భంగపడ్డ చి రుకోటి సత్యనారాయణ, మడ్డు రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తె లిసింది. ఏది ఏమైనా నియోజకవర్గం టిడీపీలో ఈ ప్రాదేశిక ఎన్నికలు ముసలం తెచ్చాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.